కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం

కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం

సీఎం కేసీఆర్‌ను రాజకీయంగా బొందపెట్టే సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ చైర్మన్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. జనగామజిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో గురువారం నిర్వహించిన  బిజెపి నాయకులు, కార్యకర్తల పోలింగ్‌ బూత్‌ మేళాలో ఆయన మాట్లాడుతూ మాటలకు చేతలకు సంబంధంలేని వ్యక్తి కేసీఆర్‌ అని విమర్శించారు. 

అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్‌ పదేళ్ల కాలంలో లక్షలకోట్లకు అధిపతి ఎలా అయ్యారని ఆయన ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ అకౌంట్‌లో రూ. 850 కోట్లు ఎక్కడివని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల ఖర్చు కోసం ఒక్కో నియోజకవర్గానికి రూ.30 కోట్ల మేర నిల్వచేశాడని ఆరోపించారు. రాష్ట్రంలో దళిత జనాభా 17శాతం ఉంటే వారిని వదిలేసి 0.6శాతం ఉన్న వారికి కీలక మంత్రి పదువులు ఇచ్చారని ఈటెల ధ్వజమెత్తారు.

11శాతం ఉన్న ముదిరాజ్‌లకు బీఆర్‌ఎస్‏లో ఒక్క ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. దేశంలో కాని, రాష్ట్రంలో కాని బీ ఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే కేసీఆర్‌, కేటీఆర్‌, కవిత, హరీష్‏రావులే బాగుపడతారని, బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్యుడు సీఎం అవుతారని చెప్పారు.  టీ అమ్ముకునే వ్యక్తిని ప్రధానమంత్రిని చేసిన చరిత్ర బీజేపీదని ఆయన గుర్తు చేశారు.

దశాబ్ధి ఉత్సవాల పేరట జీపీలు, మునిసిపాలిటీలలో డబ్బులు డ్రా చేసి దావతులు పెట్టించిన చరిత్ర కేసీఆర్‌దని ఆరోపించారు.   సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌లో ధరణి పేరుతో లక్షలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను బడాబాబులకు ధారాదత్తం చేసి లక్షల కోట్లు సంపాదించారని ఆరోపించారు.  వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ నుంచి ఓటుకు రూ.20వేలు తీసుకోవాలని, ఓటు మాత్రం నచ్చిన వారికి వేసుకోవాలని ఆయన సూచించారు. పోలీసులను కేవలం ఎమ్మెల్యేలకు బానిసలుగా పని చేయడానికి ఉపయోగించుకుంటున్నారు తప్ప దుర్మార్గాలను అరికట్టడానికి కాదని విమర్శించారు. 

ఈ ప్రభుత్వం ఇంకా కొనసాగితే తెలంగాణ వల్లకాడుగా మారుతుందని, బీజేపీని గెలిపిస్తే స్వర్ణయుగం వస్తుందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకోవాలని ఈటెల పిలుపునిచ్చారు. కాంగ్రె్‌సకు ఓటు వేసినా బీఆర్‌ఎస్‏కు వేసినట్లేనని, అందువల్ల ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఆయన సూచించారు.

దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మాట్లాడుతూ ఎన్‌కౌంటర్‌ అనే పదాన్ని రాష్ట్రంలో విస్తృత ప్రాచుర్యం చేసిన పెద్ద నాయకుడు కడియం శ్రీహరని ఎద్దేవా చేశారు. కడియం బ్రహ్మ పదార్ధం కాదని పేర్కొంటూ ఆయన ఓడిపోవడం కొత్తేమి కాదని గుర్తు చేశారు తెలంగాణ ఉద్యమ సమయంలో నై తెలంగాణ అన్న కడియంను చిత్తుగా ఓడగొట్టామని తెలిపారు. 30 ఏళ్ల పాటు రాజకీయంగా ఎదోపదవిలో ఉన్న కడియం ఘన్‌పూర్‌కు చేసింది ఏమీలేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు పల్లాకు, మల్లాకు ప్రైవేట్‌ యూనివర్సీటీలు మంజూరి చేశాడని చెప్పారు.