పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘించిన రిషి సునాక్

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ పిల్లల సంరక్షణ కంపెనీలో తన భార్య వాటాల విషయంలో పార్లమెంట్ నిబంధనలు ఉల్లంఘించినట్టు తేలింది. ఈ విషయంలో ఆయన స్పష్టమైన ప్రకటన చేయలేదని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మేరకు స్పష్టం చేసింది.  అయితే, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదని తెలిపింది. పిల్లల సంరక్షణకు మద్దతుగా నిలిచే కంపెనీలో సునాక్ భార్య అక్షతా మూర్తి వాటాదారుగా ఉన్నారన్న మీడియా నివేదికలపై విమర్శలు వెల్లువెత్తాయి.
దీంతో ఏప్రిల్‌లో పార్లమెంట్ కమీషనర్ ఫర్ స్టాండర్డ్స్ ఈ అంశంపై దర్యాప్తు ప్రారంభించింది. చట్టసభ సభ్యుల ప్రవర్తనా నియమావళిని పర్యవేక్షించే కమిషనర్ డేనియల్ గ్రీన్‌బర్గ్ ఆధ్వర్యంలో కమిటీ తాజాగా నివేదిక సమర్పించింది.  సీనియర్ చట్టసభ సభ్యుల కమిటీ పాలసీపై మీడియా అడిగి ప్రశ్నకు గ్రీన్‌బర్గ్ బదులిస్తూ ప్రధాని సునాక్ తన భార్య వాటాల గురించి ప్రకటించి ఉండాల్సిందని పేర్కొన్నారు. 
 
అయితే, నిబంధనల్లో గందరగోళం వల్లే అలా జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. ‘నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత కోడ్ ఉల్లంఘన అనుకోకుండా జరిగినట్లు కనిపిస్తోందనే నిర్ణయానికి వచ్చాను. ఇకపై దీనిపై లోతైన విచారణ అక్కర్లేదు. ఇంతటితో ముగించాలని అనుకుంటున్నాను’ అని తెలిపారు.

నిబంధనలను ఉల్లంఘించే చట్టసభ సభ్యులను సస్పెండ్ చేసే లేదా పార్లమెంటు నుంచి బహిష్కరించే అధికారం ఉన్న ఈ కమిటీ విచారణను సరిదిద్దే ప్రక్రియ ద్వారా ముగించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పడం గమనార్హం. దిద్దుబాటు చర్యల్లో భాగంగా చట్టసభ సభ్యులకు సలహాలు అందించడం, క్షమాపణలు చెప్పడం లేదా సభ్యుల ఆర్థిక ప్రయోజనాల రిజిస్టర్‌ను సరిచేయడం వంటివి ఉంటాయి.

కాగా, రిజిస్ట్రేషన్, డిక్లరేషన్ విధానంలో గందరగోళానికి గురైనందుకు క్షమాపణలు చెబుతూ సునాక్ గ్రీన్‌బెర్గ్‌కు లేఖ రాశారు. ‘ఈ విషయం ఇప్పుడు సరిదిద్దడం ద్వారా ముగిస్తున్నందుకు సంతోషిస్తున్నాను’ అని సునాక్ లేఖలో తెలిపారు.