చెస్ ప్రపంచకప్ ఫైనల్‍లో పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

చెస్ ప్రపంచ కప్ టోర్నీలో చరిత్ర సృష్టిస్తూ ఫైనల్ చేరిన భారత 18ఏళ్ల ప్లేయర్ గ్రాండ్‍మాస్టర్ ఆర్.ప్రజ్ఞానందకు తుదిపోరులో ఓటమి ఎదురైంది. గురువారం బాకు (అజర్ బైజాన్) వేదికగా జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ టై బ్రేకర్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓడిపోయాడు.  మంగళ, బుధవారాల్లో జరిగిన తొలి రెండు గేమ్స్ డ్రాగా ముగియడంతో గురువారం నాడు టై బ్రేకర్ నిర్వహించగా నార్వేకు చెందిన మాగ్నస్ కార్ల్‌సన్ 1-0 తేడాతో విజయం సాధించాడు.
చిన్న వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌గా నిలుద్దామని ప్రయత్నించిన ప్రజ్ఞానందకు చివరకు నిరాశే మిగిలింది.  ఫైనల్ రెండు గేమ్‍ల్లో అద్భుతంగా ఆడి ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్‍ను నిలురించిన ప్రజ్ఞానంద  టై బ్రేకర్లో తడబడ్డాడు. దీంతో కార్ల్‌సన్‍కు ప్రపంచకప్ టైటిల్ దక్కింది. చెస్ ప్రపంచకప్ ఫైనల్ చేరిన పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద రన్నరప్‍గా నిలిచాడు. 
 
18 ఏళ్ల వయసులో ప్రపంచకప్ లాంటి అతిపెద్ద టోర్నీలో అతడు చూపిన ప్రతిభకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ టోర్నీలో ప్రపంచ రెండో ర్యాంకర్ హికారు నకమురా, మూడో ర్యాంకర్ ఫాబినో కరునాను చిత్తు చేసి సత్తాచాటాడు ప్రజ్ఞానంద. ఫైనల్ టై బ్రేకర్‌లో కార్ల్‌సన్‍పై కాస్త తడబడిన అతడు రన్నరప్‌గా నిలిచాడు.
 
ముఖ్యంగా టై బ్రేకర్‌లో కార్ల్‌సన్ దూకుడుగా ఆడాడు. తొలి గేమ్‌లో విజయం సాధించిన అతడు రెండో గేమ్‌ను డ్రాగా ముగించాడు. తమిళనాడుకు చెందిన 18 ఏళ్ల ప్రజ్ఞానంద టై బ్రేకర్ తొలి గేమ్‌ను తెల్లపావులతో ఆడి ఆరంభంలో కార్ల్‌సన్‌ను ఒత్తిడికి గురిచేశాడు. అయితే తన సీనియారిటీని ఉపయోగించి ప్రజ్ఞానందను కార్ల్‌సన్ వెనక్కి నెట్టాడు. 
 
అంతేకాకుండా ఎత్తుకు పైఎత్తులు వేసి తొలి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. దీంతో రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ రెండో గేమ్‌లో కూడా అతడు వెనుక బడ్డాడు. రెండో గేమ్‌ను కార్ల్‌సన్ తెల్లపావులతో ఆడగా ప్రజ్ఞానంద నల్లపావులతో ఆడారు.  ప్రారంభం నుంచే మాగ్నస్ దూకుడుగా ఆడాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. కొద్ది సమయం తర్వాత ఇద్దరు ఆటగాళ్లు డ్రాకు అంగీకరించారు. ఏదేమైనా, విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్ చేరిన రెండో చెస్ భారత ఆటగాడిగా కూడా ప్రజ్ఞానంద రికార్డు దక్కించుకున్నాడు.