పంజాబ్ కాంగ్రెస్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

పంజాబ్‌ మాజీ మంత్రి, కాంగ్రెస్‌ నేత భరత్‌ భూషణ్‌ అషు నివాసంపై గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడి) సోదాలు జరిపింది. ఆయనతో పాటు కాంగ్రెస్‌ మాజీ కౌన్సిలర్‌ సన్నీ భల్లా, ఎల్‌ఐటి మాజీ చైర్మన్‌ రమణ సుబ్రమణ్యమ్‌, పంకజ్‌ మీను మన్హోత్రా, ఆయన పిఎ ఇంద్రజీత్‌ ఇందిల నివాసాల్లో ఈడి అధికారులు సోదాలు చేపట్టారు. 

గురువారం ఉదయం నుండి సుమారు 20 ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఆహార, సరఫరా శాఖలతో సంబంధమున్న చాలా మంది అధికారులు కూడా ఈడి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.

ఈడి బృందం పారామిలటరీ బలగాలతో పాటు ఏకకాలంలో కోచర్‌ మార్కెట్‌లోని మాజీ మంత్రి నివాసంతో పాటు ఆయన సహాయకుల నివాసాలకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లూథియానా, నవాన్‌ షెహర్‌లలో ఏకకాలంలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 150 మంది అధికారులు పాల్గొన్నట్లు  ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సోదాలు చేపడుతున్న సమయంలో మాజీ మంత్రి నివాసం ఎదుట భారీగా భద్రతాదళాలను మోహరించినట్లు వెల్లడించాయి. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో భరత్‌ భూషణ్‌ అషు ఆహారం, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.

 పంజాబ్‌ విజిలెన్స్‌ బ్యూరో ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేయడంతో గతంలో భరత్‌ భూషణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పంజాబ్‌, హర్యానా హైకోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఆహార కుంభకోణానికి సంబంధించిన పత్రాలను విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ నుండి ఈడి స్వాధీనం చేసుకుంది.