మొదటి త్రైమాసికంలో భారత్ జీడీపీ 8.5 శాతం

రేటింగ్ ఏజెన్సీ ఇక్రా భారతదేశ ఆర్థిక వృద్ధి రేటు అంచనాలను పెంచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) లో భారత్ జీడీపీ (స్థూల దేశీయోత్పత్తి) అంచనా 8.5 శాతానికి ఉంటుందని సంస్థ పేర్కొంది. అంతకుముందు జనవరి- మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు అంచనాను 6.1 శాతంగా పేర్కొంది. 

విశేషమేమిటంటే ఇక్రా జిడిపి అంచనా ఆర్‌బిఐ (భారతీయ రిజర్వు బ్యాంక్) అంచనా కంటే ఎక్కువగా ఉంది. ఆగస్టు 31న దేశ ఆర్థిక వృద్ధి రేటు అంటే జీడీపీ గణాంకాలు వెలువడనున్నాయి. ఇక్రా రేటింగ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, మొదటి త్రైమాసికంలో భారతదేశ జిడిపి వృద్ధి రేటు 8.5 శాతంగా ఉండనుంది. అనుకూలమైన ప్రాథమిక అంశాల్లో మద్దతు, సేవా రంగంలో పెరుగుదల కారణంగా జిడిపి రేటు గణనీయంగా పుంజుకునే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ తెలిపింది.

ఆర్‌బిఐ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశం జిడిపిని 8.1 శాతంగా అంచనా వేసింది. అంటే ఇక్రా రేటింగ్ జిడిపి అంచనా 0.4 పాయింట్లు ఎక్కువగా ఉంది. ఇది దేశం మెరుగైన ఆర్థిక పరిస్థితిని సూచిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఇక్రా తన ఆర్థిక వృద్ధి అంచనాను 6 శాతం వద్ద నిలుపుకుంది. ఇది ఆర్‌బిఐ అంచనా వేసిన 6.5 శాతం కంటే త క్కువగా ఉంది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో ప్రతికూల పరిస్థితులు కనిపించవచ్చని ఇక్రా చీఫ్ ఎకనామిస్ట్ అదితి నాయర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఏడాది క్రితంతో పోలిస్తే ప్రస్తుతం నిత్యావసర ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని సంస్థ తెలిపింది. ఇది కాకుండా ప్రభుత్వ మూలధన వ్యయంలో వేగం తగ్గే అవకాశం ఉంది. 2024 లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జిడిపి వృద్ధి రేటు పరిమితంగా ఉండే అవకాశం ఉందని అదితి నాయర్ తెలిపారు.