జడ్జి జయకుమార్ పై సస్పెన్షన్ వేటు

మంత్రి శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించిన తెలంగాణ ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి జయకుమార్ పై అసహనం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. 2018 ఎన్నికల అఫిడవిట్ కు సంబంధించిన ఓ కేసులో ప్రజాప్రతినిధుల కోర్టు జడ్జి ఈ ఆదేశాలు ఇచ్చారు.
 
రాజ్యాంగబద్ధ వ్యవస్థలపై కేసుల పెట్టాలని ఎలా ఆదేశిస్తారని ప్రశ్నిస్తూ జడ్జి జయకుమార్ పై సస్పెన్షన్ వేటు వేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు 10 మంది ఎన్నికల అధికారులపై కేసులు పెట్టాలని జడ్జి జయకుమార్ ఇటీవల తీర్పు ఇవ్వడంపై ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 
 
రాజ్యాంగ వ్యవస్థలపై కేసులు పెట్టాలని ఎలా ఆదేశిస్తారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలను నిలిపివేసింది. జడ్జి జయకుమార్ ను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.  2018లో శ్రీనివాస్‌ గౌడ్ ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పించారు.  ఆ అఫిడవిట్ ను ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లోకి అప్ లోడ్ చేసింది.
ఆ తర్వాత ఆ అఫిడవిట్ మారిపోయిందని, పాతదానిని తొలగించి మరో అఫిడవిట్ ను అప్ లోడ్ చేశారనే శ్రీనివాస్ గౌడ్ పై ఆరోపణలు వచ్చాయి.  అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారనే అభియోగాలతో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన చలువగాలి రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ట్యాంపరింగ్‌ కేసు పెట్టాలని ఆదేశించింది. 

మంత్రితో పాటు ఐఏఎస్ అధికారులపై కేసులు పెట్టాలని జడ్జి జయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర, కేంద్ర రిట్నరింగ్‌ ఆఫీసర్లపై కూడా కేసులు నమోదు చేయాలని ఆయన పోలీసులను ఆదేశించారు. అయితే పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పిటీషనర్ మరోసారి కోర్టును ఆశ్రయించారు.  దీంతో జడ్జి జయకుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.

ఎఫ్ఐఆర్ నమోదు చేసికోర్టుకు సమర్పించాలని ఆదేశించారు.  మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎన్నికల అధికారులపై కేసు నమోదు చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని మహబూబ్ నగర్ పోలీసులకు జడ్జి జయకుమార్ హెచ్చరించారు. దీంతో ఎన్నికల కమిషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.