సెప్టెంబర్ లో ఆదిత్య మిషన్ పనులు ప్రారంభం

 
*  జపాన్ తో కలిసి చంద్రయాన్- 4
 
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 విజయవంతం కావడంతో చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన దేశంగా భారత్ చరిత్రను సృష్టించింది. ఈ ప్రయోగంపై ఉత్సాహంతో ఉన్న ఇస్రో మరో కీలక ప్రయోగానికి సన్నద్ధమవుతున్నది. 
 
ఇకపై సూర్యుడిపై పరిశోధనలు జరుపనున్నది. ఇందు కోసం ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉందని ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. సూర్యుడిపై పరిశోధనలకు ఆదిత్య మిషన్‌ను సెప్టెంబర్‌‌ తొలి ప్రయోగం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఆదిత్య మిషన్‌ కోసం సన్నద్ధమవుతుందని చెప్పారు. 
గగన్‌యాన్‌ ప్రాజెక్టు ఇంకా పురోగతిలో ఉందని, త్వరలోనే ఈ ప్రాజెక్టును చేపడుతామని సోమ్‌నాథ్‌ వివరించారు. సెప్టెంబర్‌ లేదంటే అక్టోబర్‌లో ఏదో ఒక మిషన్‌ను చేపడుతామని ప్రకటించారు. క్రూ మాడ్యూల్‌, క్రూ ఎస్కేప్‌ సామర్థ్యాన్ని పరీక్షిస్తామని, పలు రకాల పరీక్షలు విజయవంతనమైన తర్వాత 2025 రోదసిలోకి వ్యోమగాములతో కూడిన నౌకను పంపుతామని ప్రకటించారు. ప్రస్తుతం చంద్రయాన్‌ ల్యాండర్‌, రోవర్‌ చక్కగా పని చేస్తున్నాయని సోమ్‌నాథ్‌ వివరించారు.
మరోవంక, చంద్రయాన్-3 తర్వాత చంద్రయాన్-4 ప్రయోగాన్ని కూడా ఇస్రో త్వరలో చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును జపాన్‌తో కలిసి భారత్ చేపడుతుందని సమాచారం. ఈ ప్రాజెక్టుకు చంద్రయాన్-4 లేదా లుపెక్స్ అని నామకరణం చేసే అవకాశం ఉందని ఇస్రో వర్గాలు తెలియజేశాయి.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో), జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) కలిసి త్వరలోనే చేపట్టే ఈ ప్రయోగాన్ని లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ (లుపెక్స్) లేదా చంద్రయాన్-4 అని పిలవనున్నారు. 2026-2028 మధ్య కాలంలో ఈ ప్రాజెక్టు సాకారం అయ్యే ఛాన్స్ కనిపిస్తోందని తెలిపాయి.

ఈ ప్రయోగం చంద్రుడిపై నిజంగానే నీరు ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టంగా చెప్పనుంది. చంద్రయాన్-4 ప్రయోగం జపాన్‌కు చెందిన హెచ్3 రాకెట్ ద్వారా సాగనుంది. ఇందులో కూడా ల్యాండర్, రోవర్ ఉంటాయి. ఇవి జాబిల్లి ఉపరితలంపై మంచు రూపంలో ఉన్న నీరు, ఇతర మూలకాల విస్తృతిపై పరిశోధనలు చేయనున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ ధ్రువమే ఎందుకు?
కాగా, ప్రమాదకరమైన, ల్యాండింగ్ కు అత్యంత క్లిష్టమైన దక్షిణ ధృవంపైననే ల్యాండర్ ను ఎందుకు దింపాలని నిర్ణయించుకున్నారో కూడా సోమనాథ్ చెప్పారు. ఇంతవరకు అమెరికా, చైనా, రష్యాల రోవర్ లు చంద్రుడిపై దిగాయి. కానీ దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన తొలి రోవర్ మాత్రం భారత్ దే. చాలా చర్చోపచర్చలు, మేథో మథనం అనంతరం దక్షిణ ధృవం పై ల్యాండర్ ను ల్యాండ్ చేయాలన్న నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 
 
దక్షిణ ధృవం పై కొన్న ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతూ ముఖ్యంగా ఆ ప్రాంతంపై సూర్యరశ్మి చాలా తక్కువ రోజులు ఉంటుందని, అది తమ పరిశోధనలకు మరింత ఉపయోక్తంగా ఉంటుందని భావించామని తెలిపారు. దక్షిణ ధృవానికి దాదాపు 70 డిగ్రీల సమీపంలో విక్రం ల్యాండర్ ను ల్యాండ్ చేశామని చెప్పారు. ఈ ప్రాంతం మన పరిశోధన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. 
 
పరిశోధనలకు అనువైన సమాచారం అక్కడ ఎక్కువగా లభిస్తుందని చెబుతూ చంద్రుడిపై మానవుడు నివసించడానికి వీలైన ఆవాస యోగ్య ప్రదేశాలను గుర్తించే లక్ష్యం కూడా ఇస్రో లక్ష్యాల్లో ఒకటి అని గుర్తు చేశారు. చంద్రుడి పై పరిశోధనలు చేస్తున్న సైంటిస్ట్ లు అక్కడి దక్షిణ ధృవం పై ఎక్కువ ఆసక్తి చూపుతారన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  సూర్య రశ్మి ప్రభావం తక్కువగా ఉండడం వల్ల నీటి జాడలు, మంచు బిందువుల జాడలు కూడా ఇక్కడే లభించే అవకాశముందని భావించామని వివరించారు. దక్షిణ ధృవాన్ని కేంద్రంగా చేసుకుని చంద్రుడిపై తదుపరి ప్రయోగాలు ఉంటాయని వెల్లడించారు.