అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న ఎన్నికల కమిషన్

తెలంగాణతోపాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతోంది. ఇందులో భాగంగా ఈ నెల 24వ తేదీ నుంచి రెండు రోజుల పాటు ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల సంఘం అధికారులు పర్యటించనున్నారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సారధ్యంలో ఎన్నికల కమిషనర్లు, అధికారులు పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ నెలాఖరులో మిజోరంలో కూడా ఈసీ అధికారుల పర్యటిస్తారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి ముందుగా కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)తోపాటు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పర్యటించి ఆయా రాష్ట్రాల్లో ఏర్పాట్లను సమీక్షించనున్నారు. వచ్చే అక్టోబర్- నవంబర్‌లో ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 17తో మిజోరం అసెంబ్లీ పదవీ కాలం ముగుస్తుంది. మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. 

తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలకు వచ్చే ఏడాది జనవరిలోని పలు తేదీలతో గడువు ముగుస్తుంది. తెలంగాణలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధికారంలో ఉండగా, మధ్యప్రదేశ్‌లో బీజేపీ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి.

ఎన్నికల అధికారుల బదిలీలపై నిషేధం

ఇలా ఉండగా, ఎన్నికల విధుల్లో భాగంగా ఓటర్ల జాబితా రూపకల్పనలో భాగస్వాములైన అధికారుల బదిలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఈ నెల 21వ తేదీ నుంచి తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే అక్టోబర్‌ 4వ తేదీ వరకు ఈ నిషేదం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ మంగ‌ళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఓటర్ల జాబితా రూపకల్పనలో పాల్గొనే జిల్లా ఎన్నికల అధికారులు(డీఈవో), ఉప జిల్లా ఎన్నికల అధికారులు, ఓటరు రిజిస్ట్రేషన్‌ అధికారులు(ఈఆర్‌వో), సహాయ ఓటరు రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్ల‌(ఏఈఆర్వో)తో పాటు బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌(బీఎల్‌వో) స్థాయి వరకు ఈ నిషేధం వర్తిస్తుందని వికాస్ రాజ్‌ పేర్కొన్నారు.

ఈ జాబితాలోని అధికారులు సెలవుపై వెళ్లాలనుకుంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని వికాస్ రాజ్‌ స్ప‌ష్టంచేశారు. దీర్ఘకాలిక సెలవుపై వెళ్లాలనుకుంటే సీఈవోతో పాటు త‌మ కమిషన్‌ అనుమతి తీసుకోవాలని ఈసీ పేర్కొంది. ఈ నిషేధం పై జాబితాలోని పోస్టుల ఖాళీలను భర్తీ చేయడంలోనూ వర్తిస్తుందని పేర్కొంది.