‘మార్గదర్శి’లో వేలం పాటల్లోనూ అవకతవకలు

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ లావాదేవీల్లో కొత్త తరహా అక్రమాలు వెలుగులోకి వచ్చాయని ఏపీ సిబిడి చీఫ్‌ ఎన్‌ సంజరు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లోని ‘మార్గదర్శి’ కార్యాలయాల్లో మూడు రోజులుగా తనిఖీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఐజి రామకృష్ణతో కలిసి సంజయ్ మీడియాతో ఆదివారం మాట్లాడారు. 
 
‘మార్గదర్శి’లో వేలం పాటల్లోనూ అవకతవకలు చోటుచేసుకున్నాయని, చిట్‌ ప్రారంభంలోనే ఖాతాదారుల సంతకాలు సేకరించి వారి బదులు ఏజెంట్లు, మేనేజర్లే వేలం పాటలో పాల్గంటున్నారని ఆయన తెలిపారు. ష్యూరిటి సంతకాలు పెట్టిన వారి ఆస్తులు అక్రమంగా లాక్కుంటున్నారని పేర్కొన్నారు.  ఇలాంటి అక్రమాల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని సంజయ్ హెచ్చరించారు. బాధితులెవరైనా ఫోన్‌ నెంబరు 9493174065కు కాల్‌ చేసి, లేదా మేసేజ్‌ రూపంలోనైనా తమకు ఫిర్యాదు చేయవచ్చునని సూచించారు.
 
కాగా, ‘మార్గదర్శి’ అక్రమాలపై డిపాజిట్‌ దారులే తమకు ఫిర్యాదు చేశారని, అందులో భాగంగానే తనిఖీలు చేపట్టినట్లు సంజరు పేర్కొన్నారు. ఈ సందర్బంగా మూడు ఎఫ్‌ఐఆర్‌లకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. చీరాలలో సుబ్రమణ్యం అనే ఖాతాదారుడి ఆధార్‌ ఆధారంగా ఆయనకు తెలియకుండానే వేలం పాట పాడారని చెప్పారు.
 
అనకాపల్లిలో ఫిర్యాదు దారుడు వెంకటేశ్వరరావుకు రూ.4.6 లక్షలు రావాల్సి వుండగా కేవలం రూ.20 ఇచ్చారని తెలిపారు. రాజమండ్రిలో కోరుకొండ విజయకుమార్‌ కూడా ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. ఈ మూడు కేసులలో బ్రాంచ్‌ మేనేజర్లని అరెస్ట్‌ చేశామని వెల్లడించారు. కొంతమంది మేనేజర్లు రికార్డులు చూపించమంటే పారిపోతున్నారని తెలిపారు. 
 
దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన శారదా చిట్స్‌ తరహాలోనే మార్గదర్శి కుంభకోణం వుందని ఈ సందర్బంగా సిఐడి ఎస్‌పి అమిత్‌ బర్దార్‌ స్పష్టం చేశారు. డిపాజిట్‌ దారులు కానివారి డాక్యుమెంట్స్‌తో అక్రమాలకి పాల్పడ్డారని తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ ఇలాంటి కంపెనీల పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలని ఆయన హెచ్చరించారు.