దొంగ ఓట్లలో అనంతపురం జడ్పీ సీఈవోపై వేటు!

ఆంధ్ర ప్రదేశ్ లో అధికార పార్టీ పెద్దల ఆదేశాలతో రాజకీయ ప్రత్యర్థుల ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదే లక్ష్యంగా పనిచేస్తున్న అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించడం ప్రారంభించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడిన అనంతపురం జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) కె.భాస్కర్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించింది. 

దీంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈసీ చర్య ఇప్పుడు అధికార యంత్రాంగంలో ప్రకంపనలు రేపుతోంది. ఎన్నికల సంఘం వద్దని చెప్పినా అధికార పక్షం అండతో బూత్‌ స్థాయి అధికారు (బీఎల్వో)లు వలంటీర్లను వెంటపెట్టుకుని ఓటర్ల తనిఖీకి వెళ్తుండడం, ఇల్లిల్లూ తిరగకుండా స్థానికంగా వైసీపీ నేతల ఇళ్లలో మకాం వేసి, వారి ఆదేశాలతో ఇష్టానుసారం ఓట్లు తొలగించడం, దొంగ ఓట్లు నమోదు చేస్తుండడం, ప్రతిపక్షాలకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం, జీరో డోర్‌ నంబర్‌పై ఓట్ల నమోదు వంటి అక్రమాలు రోజూ వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈసీ ఏకంగా జడ్పీ సీఈవోనే పదవి నుంచి తొలగించడం అధికారుల్లో ఆందోళన రేపుతోంది. 

ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ నియోజకవర్గమైన ఉరవకొండలో దొంగ ఓట్లను చేర్చడంతోపాటు ఉన్న ఓట్లను తొలగించిన పర్యవసానంగానే ఆ నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి (ఈఆర్వో)గా ఉన్న భాస్కర్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు.  తన నియోజకవర్గంలో 6 వేల బోగస్‌ ఓట్లను చేర్పించడంతోపాటు ఉన్న వాటినీ తొలగించడంపై కేశవ గతంలోనే ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఉరవకొండకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ అవకతవకల్లో ఈఆర్వో భాస్కర్‌రెడ్డి పాత్ర ఉందని తేల్చారు. 

దీంతో ఆయన్ను సస్పెండ్‌ చేయాల్సిందిగా సీఎస్‌కు ఈసీ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అయినా చాలారోజులు పెండింగ్‌లో ఉంచారు. ఈసీ మరోసారి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు పంపడంతో భాస్కర్‌రెడ్డిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉరవకొండ నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు ప్రక్రియలో పెద్ద తతంగమే నడచిందని చెబుతున్నారు.

ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేత తనయుడు ఆ నియోజకవర్గంలోని బూత్‌ స్థాయి అధికారు(బీఎల్వో)లతో ఓ ప్రైవేట్‌ వ్యక్తి ఇంట్లో సమావేశమయ్యారు. 6వేల ఓట్లు తొలగించాలని హుకుం జారీ చేయడంతో అధికారులు ఆ పని చేశారు. ఈసీ సూచనలు, నిర్దేశించిన విధివిధానాలను తుంగలో తొక్కారు. ఓట్ల తొలగింపునకు సంబంధించి ఫారం-7 గానీ, నోటీసులుగానీ ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో రాజకీయ ప్రత్యర్థుల ఓట్లను తొలగించేశారు. దీనిపై ఆధారాలతో ఈసీకి కేశవ్‌ ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించింది. 

ఓట్ల తొలగింపుపై తొలుత స్థానిక అధికారులే విచారణ జరిపారు. అవకతవకలకు జరగలేదని, నిబంధనల మేరకే వ్యవహరించారని వారు నివేదిక పంపారు. అందులో స్పష్టత లేకపోవడంతో ఢిల్లీ నుంచి ఈసీ అధికారులే స్వయంగా ఉరవకొండకు వచ్చారు. విచారణ చేపట్టి, స్థానిక అధికారులిచ్చిన నివేదికలు తప్పుడువని తేల్చారు. 

ఓట్ల తొలగింపు ప్రక్రియలో విధివిధానాలు అవలంబించలేదని గుర్తించారు. ఇందుకు భాస్కర్‌రెడ్డిని బాధ్యుడిగా గుర్తించి ఆయన సస్పెన్షన్‌కు ఈసీ ఆదేశాలిచ్చింది. కాగా, ఇదే నియోజకవర్గంలో ఓటరు జాబితాలో మరికొన్ని అక్రమాలు జరిగినట్లు ఎన్నికల సంఘానికి మరోమారు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. 

జాబితాలో దాదాపు 9,189 ఓట్లు స్థానికేతరులు, చనిపోయిన, వలసలు వెళ్లిన వారివి ఉన్నట్లు గుర్తించారు. అందులో అధికంగా నకిలీ, డబుల్‌, ట్రిపుల్‌ ఓట్లు నమోదు చేశారనే ఫిర్యాదులు అందినట్లు తెలుస్తోంది. వీటిపైనా విచారణకు ఆదేశించే అవకాశాలున్నాయని అధికార వర్గాలు అంటున్నాయి.  ఇదే అంశంలో మరో ఈఆర్వోపై వేటుపడొచ్చని ప్రచారం జరుగుతోంది. ఇది అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారుల్లో కలకలం రేపింది. పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు ఓట్ల తొలగింపు వ్యవహారంలో అప్పట్లో ఈఆర్‌ఓలుగా వ్యవహరించిన ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫారసు చేసింది. జడ్పీ సీఈఓగా ఉన్న కె.భాస్కర్‌రెడ్డిని సస్పెండ్‌ చేశారు. మరో అధికారి ఎవరనే దానిపై స్పష్టత రావాల్సిఉంది.