అలిపిరి నడక మార్గంలో ఉన్న వందకు పైగా తినుబండారాలు విక్రయించే దుకాణాలలో ఇకపై పండ్లు, కూరగాయలు విక్రయించరాదని టిటిడి సూచించింది. భక్తులు వీటిని కొనుగోలు చేసి సాధు జంతువులకు తినిపించడం వల్ల వాటి రాక పెరుగుతోందని, ఈ జంతువుల కోసం క్రూరమృగాలు అటువైపు వచ్చి భక్తులపై దాడి చేస్తున్నాయని తెలిపింది.
ఇటీవల క్రూరమృగాల దాడుల నేపధ్యంలో అలాంటి పదార్థాల విక్రయాలు జరుపరాదని సూచించింది. తిరుమల నడక మార్గాల్లో క్రూరమృగాల కదలికల నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా దుకాణదారులకు టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి పలు సూచనలు చేశారు.
తిరుపతిలోని పరిపాలనా భవనంలో పోలీసు, అటవీ, ఎస్టేట్, ఆరోగ్య శాఖ అధికారులతోపాటు దుకాణాల నిర్వాహకులతో ఈవో శుక్రవారం సమావేశం నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈవో మాట్లాడుతూ నడకమార్గాల్లో విక్రయాలకు సంబంధించి అటవీ, ఎస్టేట్, ఆరోగ్యశాఖల అధికారులతో పాటు పలువురు భక్తులు పలు సూచనలు చేసినట్టు చెప్పారు.
అన్ని దుకాణాల వద్ద తడి చెత్తను, పొడి చెత్తను వేరువేరుగా చెత్తకుండీల్లో వేయాలని తెలిపారు. నడక మార్గంలో రోజుకు రెండు నుంచి మూడు టన్నుల చెత్త పోగవుతోందని ఆయన పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో భాగంగా నడకదారి పొడవునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తినుబండారాల దుకాణదారులు ఎఫ్ఎస్ఎస్ఐ నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేశారు. క్రూరమృగాల జాడ కనిపిస్తే వెంటనే తెలిపేందుకు వీలుగా అటవీ, ఆరోగ్య, విజిలెన్స్ విభాగాల అధికారుల ఫోన్ నంబర్లు ప్రదర్శిస్తామని తెలిపారు.

More Stories
ఏపీకి ముంచుకొస్తున్న ‘మొంథా’ తుపాను ముప్పు
ఈ దశాబ్దం మోదీదే… బీహార్ లో ఎన్డీయే విజయం
వందల మొబైల్ ఫోన్లు పేలడంతో బస్సు ప్రమాదం?