నిధుల మల్లింపు, అప్పులపై గవర్నర్ కు బీజేపీ ఫిర్యాదు

వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పంచాయితీ నిధులు దారి మళ్లింపు, అపరిమితంగా చేస్తున్న అప్పులపై గవర్నర్ అబ్దుల్ నజీర్ కు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఇతర నేతలు కలిసి ఫిర్యాదు చేశారు.

“గ్రామాలను అభివృద్ధి చేస్తామని వైసీపీ హామీ ఇచ్చింది. వాగ్దానాలు అమలు చేయకుండా మోసం చేశారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారు. గ్రామాల్లో ప్రభుత్వం పనులు నిలిపివేశారు. చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా బిల్లులు చెల్లించలేని పరిస్థితి. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో కొంతమంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారు” అంటూ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి పరిస్థితిని వివరించినట్లు పురందేశ్వరి తెలిపారు. 

సర్పంచులకు న్యాయం చేయాలని, గ్రామీణ వ్యవస్థను కాపాడాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంపై ఉన్న అప్పుల భారంపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 4 సంవత్సరాల కాలంలో 7.44 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చారని తెలిపారు. ఎఫ్ఆర్బీఎంకు లోబడి తీసుకొచ్చిన అప్పు కొంతవరకు ఉంటే ఆ పరిధిలోకి రానివ్వకుండా అనేక విధాలుగా వేల కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అప్పులు తెచ్చిందని పురంధరేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడం, వివిధ కార్పొరేషన్లు ద్వారా ఆదాయం లేని వాటిని కూడా ఉన్నట్లుగా చూపించి మరీ అప్పులు తెచ్చారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చిన్నట్లు ఆమె చెప్పారు. బెవరేజ్ కార్పొరేషన్ ద్వారా కూడా మద్యం మీద అప్పులు తెచ్చారని ఆమె తెలిపారు. పేదలకు మద్యం సరఫరా చేసి కుటుంబాన్ని చిధ్రం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని చూపి అప్పులు చేయటం దుర్మార్గం అంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 

రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థగా గవర్నర్ ఉన్నారు కాబట్ వీటిపై స్పందించాలని  ఆయనను కలిసి విజ్ఞప్తి చేసినట్లు పురందేశ్వరి చెప్పారు.  కాగా, ఏపీ అప్పులపై తాము చేస్తున్న వాదనలను ఖండిస్తున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆస్తులు తనఖా విషయాలపై కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని అంశాలు ఎందుకు ప్రస్తావించలేదని ఆమె ప్రశ్నించారు. 

రాష్ట్ర ప్రభుత్వం మసి పూసి మారేడు కాయ చేసే విధంగా వ్యవహరిస్తుందని ఆమె విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులపై కాగ్ నివేదిక కూడా ఇచ్చిందని ఆమె గుర్తు చేశారు. ఆ రిపోర్టులో చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తీరు ఎంత అధ్వానంగా ఉందో అందరికీ అర్థమవుతుందని పురందేశ్వరి మండిపడ్డారు.