సుప్రీంకోర్టును విస్తరించేందుకు ప్రణాళిక

సుప్రీంకోర్టును విస్తరణ చేపట్టే  యోచనలో ఉన్నట్లు మంగళవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి. వై చంద్రచూడ్‌ ప్రకటించారు. సుప్రీం కోర్టు లాన్స్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగిస్తూ  సుప్రీంకోర్టు విస్తరణ ప్రణాళిక గురించి వివరించారు. సుప్రీంకోర్టులో 27 అదనపు కోర్టులు, జడ్జీల సంఖ్యను 51కి పెంచనున్నట్లు ప్రకటించారు. 

ప్రస్తుతం సుప్రీంకోర్టులో 16 కోర్టులు, 2 రిజిస్టార్‌ కోర్టులు ఉన్నాయి. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 32గా ఉంది. న్యాయస్థానాన్ని  ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకురావడానికి, అందరినీ కలుపుకొని పోయేందుకు ప్రాధాన్యతా ప్రాతిపదికన అత్యున్నత న్యాయస్థాన మౌలిక సదుపాయాల విస్తరణ అత్యవసరమని చెప్పారు. 

న్యాయ వ్యవస్థ మౌలిక సదుపాయాల ఆధునీకరణలో భాగంగా ఈ ప్రాజెక్టు ఉండనుందని తెలిపారు. 27 అదనపు కోర్టులు, 51 జడ్జీల చాంబర్స్‌, 4 రిజిస్ట్రార్‌ కోర్టు రూమ్స్‌, 16 రిజిస్ట్రార్‌ చాంబర్స్‌, న్యాయవాదుల, పిటిషన్‌దారుల కోసం అవసరమైన ఇతర సౌకర్యాలు కల్పించడానికి నూతన భవనాన్ని నిర్మించడం ద్వారా సుప్రీంకోర్టును విస్తరించాలని తాము ప్లాన్‌ చేస్తున్నామని వెల్లడించారు.

జ్యుడీషియల్‌ వ్యవస్థను ఆధునీకరించడమే కొత్త ప్రాజెక్టు ముఖ్యోద్దేశమని చెప్పారు. ”27 అదనపు కోర్టులు, 51 న్యాయమూర్తుల ఛాంబర్లు, నాలుగు రిజిస్ట్రార్‌ కోర్టు రూమ్‌లు, 16 రిజిస్ట్రార్‌ ఛాంబర్లు, న్యాయవాదులు, కక్షిదారులకు అవసరమైన ఇతర సదుపాయాలకు వెసులుబాటు కల్పిస్తూ కొత్త భవనాన్ని నిర్మించడం ద్వారా అత్యున్నత న్యాయస్థానాన్ని విస్తరించాలన్నది మా ప్రణాళికగా వుంది.” అని చంద్రచూడ్‌ తెలిపారు.

ఈ విస్తరణ రెండు దశల్లో జరగనుందని చెప్పారు. 9,000కు పైగా తీర్పులను ప్రాంతీయ భాషల్లోకి అనువదించినట్లు సిజెఐ చెప్పారు. 9,423 తీర్పులను అస్సాం, బెంగాలీ, గారో, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠి, నేపాలీ, తమిళ్‌, బెంగాలీ, తెలుగు, ఉర్దూలతో పాటు పలు ప్రాంతీయ భాషల్లోకి అనువదించినట్లు తెలిపారు.

8,977 తీర్పులను హిందీలోకి అనువదించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రారంభమైనప్పటి  నుండి వచ్చిన మొత్తం 35,000 తీర్పులను ప్రతి పౌరునికి ప్రతి భాషలో అందుబాటులో ఉండేలా  కృషి చేస్తున్నట్లు వివరించారు.  గత 76ఏళ్ళలో భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్ర అంటే భారతీయుల రోజువారీ జీవన పోరాటాల చరిత్రేనని చంద్రచూడ్‌ తెలిపారు. 

మన చరిత్ర అంటూ మనకేమైనా నేర్పించింది అంటే అది ఇదేనని అయన చెప్పారు. రాజ్యాంగ పరిమితులకు లోబడే పాలనా వ్యవస్థల కార్యకలాపాలకు’ హామీ కల్పించడంలో న్యాయవ్యవస్థ ముఖ్య భూమిక పోషిస్తుందని పేర్కొన్నారు. తమ హక్కులు, స్వేచ్ఛలకు రక్షణ కల్పించాలని కోరే వ్యక్తులకు సురక్షితమైన ప్రజాస్వామ్య స్థలాన్ని కోర్టులు అందిస్తాయని చెప్పారు.