సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు పాఠక్ కన్నుమూత

పారిశుద్ధ్యాన్ని ఒక ఉద్యమంలా సులభ్‌ ఇంటర్నేషనల్‌ వ్యవస్థాపకుడు, స్వచ్ఛ రైలు మిషన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ బిందేశ్వర్‌ పాఠక్‌ కన్నుమూశారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సులభ్‌ ఇంటర్నేషనల్‌ సెంట్రల్‌లో ఉదయం జెండా ఎగురవేసిన తరువాత ఆయ‌న ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది . వెంటనే ఆయన్ని ఢిల్లీ ఎయిమ్స్‌ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
 
భారత్ లో బహిరంగ మల, మూత్ర విసర్జన ఒక సాధారణ విషయంగా పరిగణిస్తున్న సమయంలో.. అది అనాగరికమని, అనారోగ్య కారకమని ప్రచారం చేస్తూ, సులభ్ ఇంటర్నేషనల్ సంస్థను స్థాపించి, వాడవాడలా కామన్ టాయిలెట్లను నిర్మించే ఉద్యమాన్ని చేపట్టిన బిందేశ్వర్ పాఠక్ మంగళవారం గుండెపోటుతో మరణించారు. 
 
సులభ్ ఇంటర్నేషనల్ సంస్థ కమ్యూనిటీ టాయిలెట్ల నిర్మాణమే కాకుండా, మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల సమర్ధ నిర్వహణ, విద్య ద్వారా సంస్కరణలు.. మొదలైన రంగాల్లోనూ కృషి చేస్తున్న స్వచ్ఛంధ సంస్థగా పేరుగాంచింది.  బిందేశ్వర్‌ 1970లో సులభ్‌ ఇంటర్నేషనల్‌ సోషల్‌ సర్వీస్‌ ఆర్గనైజేషన్‌ను స్థాపించారు.
 
అప్పటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్‌ ప్రభు ఆధ్వర్యంలో రైలు ప్రాంగణంలో పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో 2016లో బిందేశ్వర్‌ స్వచ్ఛ రైలు మిషన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. 1991లో మాన్యువల్ స్కావెంజర్లను విముక్తి చేయడం, పునరావాసం కల్పించడం కోసం, పోర్-ఫ్లష్ టాయిలెట్ టెక్నాలజీని అందించారు.
 
బిందేశ్వర్ పాఠక్ మరణంపై ప్రధాని మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు అన్నారు. బిందేశ్వర్ పాఠక్ సామాజిక సేవలో, అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడంలో ఎంతో కృషి చేశారని ప్రధాని గుర్తు చేశారు. స్వచ్ఛ భారత్ కు తొలి అడుగులు వేసింది బిందేశ్వర్ పాఠక్ యేనన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నానని ప్రధాని ట్వీట్ చేశారు.
 
సులభ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేయడం ద్వారా సఫాయి కార్మికుల సముద్ధరణ కోసం అవిరళ కృషి జరిపిన బిందేశ్వర్ పథక్ మృతి పట్ల సామజిక సమరసత అఖిల భారత కన్వీనర్ శ్యామ్ ప్రసాద్ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని ఆయన కొనియాడారు.
 
బీహార్ లోని వైశాలి జిల్లా రాంపూర్ బాఘేల్ గ్రామంలో జన్మించిన పాఠక్ 1964లో బనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పాట్నా విశ్వవిద్యాలయం నుండి 1980లో మాస్టర్స్ డిగ్రీని , 1985లో పిహెచ్ డిని పూర్తి చేశారు. విద్యాభ్యాసం అనంతరం మహాత్మాగాంధీ స్ఫూర్తితో సులభ్ ఇంటర్నేషనల్ ను స్థాపించారు.
 
ప్రభుత్వ, పౌరుల భాగస్వామ్యంతో అద్భుతాలు చేయొచ్చని చూపించారు. ‘సులభ్ కాంప్లెక్స్’ల నిర్మాణంతో సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చెబితే అతిశయోక్తి కాదు. ఆ సమస్య తీవ్రత తెలిసిన వారికి ఆ విషయం తేలిగ్గానే అర్థమవుతుంది. సులభ్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లను నిర్మించి ఇచ్చారు. పేదల కోసం మరో 13 లక్షల టాయిలెట్లు నిర్మించి ఇచ్చారు. వీటి కోసం అత్యంత చవకైన ‘టుపిట్’ సాంకేతికతను ఉపయోగించారు.
 
పర్యావరణ కాలుష్యాన్ని నివారించడం కోసం పాఠక్ చేసిన కృషికి భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును అందించింది. అలాగే పారిశుధ్యం, పరిశుభ్రత రంగంలో ఆయన చేసిన కృషికి వివిధ జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఆయన ఆక‌స్మిక మృతి ప‌ట్ల ప‌లువురు సంతాపం ప్ర‌క‌టించారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున భాగల్‌పుర్ నుంచి పోటీ చేసి గెలిచారు. పరిశుభ్రత, తదితర అంశాలపై అనేక పుస్తకాలను రాశారు.