పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ రద్దు

పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకు పార్లమెంటును ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ బుధవారం రాత్రి రద్దు చేశారు. పార్లమెంటు పదవీ కాలం ముగియడానికి మూడు రోజుల ముందుగానే షరీఫ్ ఈ సిఫారసు చేశారు. తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నడుమ పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. 
 
పాకిస్తాన్ పార్లమెంటు పదవీ కాలం ఈ నెల 12తో ముగుస్తుంది. అనంతరం ఏర్పడే ఆపద్ధర్మ ప్రభుత్వం 90 రోజుల్లోగా ఎన్నికలను నిర్వహిస్తుంది. షరీఫ్ బుధవారం పార్లమెంటులో మాట్లాడుతూ, తాను పార్లమెంటు రద్దుకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఆపద్ధర్మ ప్రధాన మంత్రిని నియమించేందుకు అధికార, ప్రతిపక్షాలతో గురువారం నుంచి చర్చలు ప్రారంభిస్తానని తెలిపారు.
 
ఇదిలావుండగా, ఎన్నికల కమిషన్ తాజా జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయవలసి ఉంది. కాబట్టి పార్లమెంటు ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికలు ఆలస్యమైతే ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారనే ఆందోళన కూడా ఉంది. 
 
2018 జూలైలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పార్టీ విజయం సాధించింది. గత ఏడాది అవిశ్వాస తీర్మానంలో ఆయన ప్రధాన మంత్రి పదవిని కోల్పోయారు. ఆయన పార్టీ ప్రతిపక్షంలోకి మారింది. తోషాఖానా బహుమతుల కేసులో ఆయనకు జైలు శిక్ష పడింది. అంతేకాకుండా పార్లమెంటుకు పోటీ చేయకుండా నిషేధానికి గురయ్యారు.

తోషాఖానా బహుమతుల వేలం

మరోవంక, పాకిస్థాన్‌ సర్కార్‌ ప్రభుత్వ తోషాఖానాలోని బహుమతులను వేలం వేయాలని నిర్ణయించిందని ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ప్రకటించారు. తోషాఖానా కానుకల ద్వారా వచ్చిన డబ్బును పేదలు, నిస్సహాయకుల కోసం వినియోగిస్తామని వెల్లడించారు. 

పాక్‌ మీడియా నివేదిక ప్రకారం.. ‘తోషాఖానాలోని మిలియన్ల విలువైన బహుమతులను వేలం వేయాలని నిర్ణయించాను. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అనాథ పిల్లల సంక్షేమ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాల కోసం వినియోగిస్తాం. వాటికి తప్ప ఆ నిధులు మరెక్కడికీ వెళ్లవు’ అని షెహబాజ్‌ వెల్లడించారు. 

మరోవైపు తోషాఖానా బహుమతులను అక్రమంగా విక్రయించిన కేసులోనే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ జైలు పాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ బహుమతులను వేలం వేయాలని షెహబాజ్‌ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.