ఏపీలో అర్ధరాత్రి నుండి విద్యుత్ ఉద్యోగుల సమ్మె!

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్లపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ మంగళవారం ఓ ప్రకటన చేసింది.

బుధవారం అర్ధరాత్రి నుంచి ఏపీ వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టబోతున్నారు. ఈ మేరకు సమ్మె కు సంబంధించిన పోస్టర్ ను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు విడుదల చేశారు. రెండేళ్లుగా సమస్యలపై చర్చలు జరుపుతున్నా పరిష్కారం లేదని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. 
 
గత నెల 21 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, రేపు ప్రభుత్వం ఇచ్చిన సిమ్ కార్డులు తిరిగి ఇచ్చేస్తామని ఆయన వెల్లడించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న 12 సమస్యలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదని విద్యుత్ ఉద్యోగ నేతలు తెలిపారు. వేతన సవరణ పేరుతో జీతాలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 
 
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై స్పష్టత ఇవ్వడం లేదని పేర్కొంటూ మిగతా ఉద్యోగులతో తమను పోల్చవద్దని వారు కోరారు. 2022 ఏప్రిల్ నుంచి వేతన సవరణ జరగాల్సి ఉన్నా, ఇప్పటివరకు జరగలేదని తెలిపారు. అర్దరాత్రి నుంచి మొదలుపెట్టబోతున్న సమ్మెలో వాచ్ మెన్ నుంచి ఇంజినీర్ వరకూ అందరూ సమ్మెలో పాల్గొంటారని విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రకటించారు. 
 
ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రభుత్వం, యాజమాన్యమే బాధ్యత వహించాలని వారు స్ఫష్టం చేశారు. మరోవైపు విద్యుత్ ఉద్యోగుల సమ్మె పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కార్యాలయాలు, కేంద్రాలు, సబ్ స్టేషన్ల వద్ద భద్రత పెంచారు. అలాగే విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగితే ఎస్మా ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరికలు చేస్తోంది.