‘అసోం రైఫిల్స్‌’పై మణిపూర్‌ పోలీసుల కేసు

దేశంలో అత్యంత చరిత్ర కలిగిన పారామిలటరీ దళం  అసోం రైఫిల్స్‌ బలగాలపై మణిపూర్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  విధులకు ఆటంకం కలిగించడం, నేరపూరిత బెదిరింపులు.. వంటి అభియోగాలతో రాష్ట్ర పోలీసులు క్రిమినల్ కేసును నమోదు చేశారు. విధి నిర్వహణ నిమిత్తం వెళుతున్న తమను అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది అడ్డుకుని తమను ముందుకు వెళ్లనీయలేదని ఆరోపిస్తూ మణిపూర్‌ పోలీసులు వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.
 
ఆయుధాలతో ఉన్న కొందరు కుకీ మిలిటెంట్లను పట్టుకోవడానికి బిష్ణుపూర్‌ జిల్లా క్వాక్తా గోతల్‌ రోడ్డుపై వెళ్తున్న పోలీసు సిబ్బందిని తొమ్మిది మంది అస్సాం రైఫిల్స్‌కు చెందిన భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. తాము కూడా శాంతిభద్రతల పర్యవేక్షణ విధుల్లోనే ఉన్నామని చెప్పినా వినకుండా తమ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పెట్టి ముందుకు వెళ్లనీయలేదని, దీంతో మిలిటెంట్లు తప్పించుకున్నారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
 
పోలీసుల సేవలను నిలిపేసిన సమయంలో చట్టబద్ధ విధులు నిర్వర్తించకుండా అసోం రైఫిల్స్‌ 9వ బెటాలియన్‌ సిబ్బంది కుకీ మిలిటెంట్లకు సహకరించారంటూ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంటూ ఈ నెల 5న బిష్ణుపూర్‌ జిల్లాలోని ఫౌగక్‌చావో ఇఖారు పోలీస్‌ స్టేషన్‌లో ఈ కేసు నమోదయింది.   ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు విధులు నిర్వర్తించకుండా అసోం రైఫిల్స్‌ బలగాలు అడ్డుకుంటున్నాయని పోలీసు వర్గాలు మండిపడుతున్నాయి.
 
మరోవైపు, అసోం రైఫిల్స్‌ సీనియర్‌ అధికారి మాట్లాడుతూ అల్లర్లను అదుపు చేసేందుకు రాత్రింబవళ్లు తాము కష్టపడుతుంటే పోలీసులు తమపైనే కేసులు పెట్టడం విడ్డూరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు.  మణిపూర్‌లో కుకీ-మైతేయి తెగల మధ్య ఘర్షణలు, చెలరేగిన హింసకు సంబంధించి 3 నెలల్లో 6,500కు పైగా పోలీసు కేసులు నమోదయ్యాయి. ఈమేరకు సుప్రీం కోర్టుకు ఆ రాష్ట్ర పోలీసులు సోమవారం నివేదిక సమర్పించారు. 
 
‘‘అల్లర్లు ప్రారంభమైన ఈ ఏడాది మే 3 నుంచి జూలై 30 వరకు మొత్తం 6,523 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీటిలో జీరో ఎఫ్‌ఐఆర్‌లే ఎక్కువ. హత్య, అత్యాచారం, ఆస్తుల ధ్వంసం, దాడులు, దోపిడీ, ప్రార్థనా స్థలాల ధ్వంసానికి సంబంధించిన కేసులున్నాయి” అని తెలిపారు.  ఈ నెల 7న అస్సాం రైఫిల్స్‌కు వ్యతిరేకంగా ప్రధానమంత్రి మోదీకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం మెమోరాండంను సమర్పించింది. అస్సాం రైఫిల్స్‌ ఏక పక్షంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మణిపూర్‌ నుంచి అస్సాం రైఫిల్స్‌ను శాశ్వతంగా తొలగించాలని కూడా డిమాండ్‌ చేశారు.