న్యాయమూర్తులు కూడా తమ ఆస్తులను ప్రకటించాలి

హైకోర్టు, సుప్రీంకోర్టు వంటి ఉన్నత న్యాయస్థానాల్లోని న్యాయమూర్తులు తమ ఆస్తులను ప్రతీ సంవత్సరం కచ్చితంగా వెల్లడించేలా ఒక చట్టం తీసుకురావాలని పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని జడ్జీలు ప్రతీ సంవత్సరం తమ ఆస్తులను ప్రకటించడం వల్ల న్యాయవ్యవస్థ విశ్వాసనీయత పెరుగుతుందని, అలాగే, న్యాయ వ్యవస్థ పారదర్శకత మరింత పెరుగుతుందని ఆ కమిటీ అభిప్రాయపడింది. 
 
సుప్రీంకోర్టు, హైకోర్టుల్లోని జడ్జీలు ప్రతీ సంవత్సరం తమ ఆస్తులను కచ్చితంగా ప్రకటించేలా చట్టం చేయాలని ఆ పార్లమెంటరీ కమిటీ సిఫారసు చేసింది. సిబ్బంది, ప్రజా సమస్యలు, చట్టం, న్యాయం తదితర అంశాలపై ఏర్పడిన పార్లమెంటరీ స్థాయి సంఘం ఈ సిఫారసులను చేసింది. ఈ కమిటీ తన నివేదికను పార్లమెంటు ఉభయ సభలకు సమర్పించింది. 

న్యాయ వ్యవస్థ విధానాలు, సంస్కరణలు అనే అంశంపై ఈ నివేదికను ఆ కమిటీ రూపొందించింది. ఈ స్థాయి సంఘానికి బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ నేతృత్వం వహించారు. ‘‘ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంటుందని ప్రకటించేంత వరకు సుప్రీంకోర్టు వెళ్లింది. అలాంటప్పుడు, సుప్రీంకోర్టు, హైకోర్టుల జడ్జీలు కూడా తమ ఆస్తులను ప్రకటించాలి కదా’’ అని సుశీల్ కుమార్ మోదీ వ్యాఖ్యానించారు.

న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయస్సు పెంపు, మహిళలు, ఇతర అణగారిన వర్గాల వారికి న్యాయ వ్యవస్థలో సముచిత అవకాశాలు కల్పించడం, జడ్జీల వెకేషన్ కాలాన్ని తగ్గించడం, ప్రాంతీయంగా సుప్రీంకోర్టు బెంచ్ లను ఏర్పాటు చేయడం.. మొదలైన ఇతర సిఫారసులను కూడా ఆ పార్లమెంటరీ కమిటీ చేసింది. 

కాగా, సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల ప్రకటనల దిశగా  సుప్రీంకోర్టు 2009 లోనే చర్యలు తీసుకుంది. ప్రతీ సంవత్సరం సుప్రీంకోర్టు జడ్జీలు తమ ఆస్తులను స్వచ్చంధంగా ప్రకటించాలని, వాటిని సుప్రీంకోర్టు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని సూచించింది. 2009 సెప్టెంబర్ 8 న సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ (అందరు న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్న ధర్మాసనం) ఈ నిర్ణయం తీసుకుంది.