ఎన్నికల ముందు అవిశ్వాస తీర్మానం ఓ అవకాశం

2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం ఓ అవకాశం అని చెబుతూ దీనిపై చర్చను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని పార్టీ ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఉద్భోధించారు. ‘లాస్ట్ బాల్’ కు సిక్స్ కొట్టాలని క్రికెట్ పరిభాషలో వారికి సూచించారు.
కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ  ఢిల్లీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించడంపై హర్షం వ్యక్తం చేశారు. అది 2024 ఎన్నికలకు సెమీ ఫైనల్స్ వంటిదని చెప్పారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన సెమీ ఫైనల్స్‌లో ఇండియా కూటమి పరాజయం పాలైందని మోదీ ఎద్దేవా చేశారు.
 
ఇండియా కూటమిపై మోదీ విరుచుకుపడుతూ ఇండియానుంచి కుటుంబ పాలనకు, అవినీతికి, అవకాశవాద రాజకీయాలకు ముక్తి లభించాలని కోరారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత ఇండియా కూటమి పక్షాలకు లేదని మోదీ మండిపడ్డారు. సామాజిక న్యాయానికి ఇండియా కూటమి పార్టీల వల్లే నష్టం జరిగిందని విమర్శించారు.
 
విపక్ష కూటమి ‘ఇండియా’ లోని పార్టీల్లో పరస్పర విశ్వాసం కొరవడిందని, అందువల్ల తమ వైపు ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కోసమే అవిశ్వాస తీర్మానం పెట్టారని పార్టీ ఎంపీలకు ప్రధాని మోదీ వివరించారు. ‘వారికి ఒకరిపై ఒకరికి నమ్మకం లేదు. తమతో చివర వరకు ఎవరు ఉంటారో అన్న విషయంలో విశ్వాసం లేదు. అందువల్ల తమతో ఎవరు ఉన్నారో తెలుసుకోవడం కోసమే ఈ అవిశ్వాస తీర్మానం పెట్టారు’ అని వివరించారు. ఈ సందర్భంగా విపక్ష కూటమిని ప్రధాని మోదీ గర్విష్టి బృందంగా అభివర్ణించారు. విపక్ష నేతలు గర్వంతో, అహంకారంతో ఉంటారని విమర్శించారు.
ఆగస్ట్ 9 నుంచి బీజేపీ మరో క్విట్ ఇండియా నినాదం ప్రారంభమవుతుందని చెబుతూ ఆగస్టు 14న విభజన దినాన్ని జరుపుకుందామని మోదీ చెప్పారు. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్ కార్యక్రమం పూర్తికాగానే ప్రతి గ్రామం నుంచి అమృత కలశ యాత్ర ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.  2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ప్రణాళిక ఇందులో ఉందని తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి, ఆ ఇంటి పెద్దకు ఈ ప్రణాళికను ఇవ్వాలని కోరారు. ప్రతి గ్రామంలో 75 మొక్కలు నాటాలని సూచించారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం తహసిల్, జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటుకుని ఢిల్లీకి చేరుకుంటుందని మోదీ చెప్పారు.