ఇద్దరు అక్రమ చొరబాటుదారుల హతం

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లాలో నియంత్రణ రేఖ  వెంబడి దేశంలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను  భద్రతా బలగాలు అంతమొందించాయి. సోమవారం తెల్లవారుజామున పూంచ్ జిల్లాలోని దేగ్వార్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ వద్ద చీకటి ముసుగులో చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. 
అయితే ముష్కరుల కదలికలను గుర్తించిన భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. దీంతో ఉగ్రవాదులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారని కశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. మరికొంత మంది పాకిస్థాన్ వైపు పారిపోయారని వెల్లడించారు. 
 
ఆ ప్రాంతంలో కుప్వారా పోలీసులతో కలిసి ఆర్మీ సంయుక్తంగా గాలింపు చేపట్టిందని తెలిపారు.  కాగా, జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి గత 24 గంటల్లో ఇది రెండో చొరబాటు ప్రయత్నం. ఆదివారం కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు అడ్డుకున్నాయి. సైన్యం కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు తెలిపారు.