ఫార్మాసిటీ భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలో కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫార్మా సిటీ పనులు చేపట్టింది సర్కార్. అయితే ఇక్కడ భూసేకరణ ప్రక్రియపై స్థానికులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం అందించే పరిహారం విషయంలో పలు గ్రామాల పరిధిలోని రైతులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. 
ఈ పిటిషన్లపై విచారించిన న్యాయస్థాన కీలక తీర్పునిచ్చింది. భూసేకరణ ప్రక్రియలోని నోటిఫికేషన్లు నుంచి మొదలు అవార్డులు, పరిహారం డిపాజిట్‌ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది.
 
ఈ సందర్భంగా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది హైకోర్టు ధర్మాసనం.  భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని యాచారం మండల పరిధిలోని మేడిపల్లి, కుర్మిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. టిషనర్‌ తరఫున న్యాయవాది రవికుమార్ వాదనలు వినిపించారు. 
 
దీనిపై జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ విచారణ చేపట్టగా తీర్పు వెలువరించారు. భూసేకరణ ప్రక్రియ చట్టబద్ధంగా, నిబంధనలకు అనుగుణంగా జరగలేదని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. ప్రతిష్టాత్మకమైన ఫార్మాసిటీ ప్రాజెక్టు 2015లో ప్రారంభమైనప్పటికీ న్యాయపరమైన వివాదాల వల్ల ఇప్పటికీ రూపుదిద్దుకోలేదని వ్యాఖ్యానించింది. 
ఐఏఎస్ హోదాల్లో ఉన్న అధికారులు భూసేకరణ చట్టం, ప్రక్రియను ఎందుకు అర్థం చేసుకోవడం లేదని కామెంట్స్ చేసింది. భూసేకరణ చేయాల్సిన విధివిధానాలను వివరిస్తూ రెవెన్యూ శాఖ ప్రత్యేక సీఎస్ 2017లో మెమో ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని విస్మరించటంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

2017లో ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారని గుర్తు చేసిన హైకోర్టు దాని కాలపరిమితి ముగిసిందని తెలిపింది. అయితే ప్రస్తుత ప్రక్రియను దాని ఆధారంగానే కొనసాగించి, దాని ప్రకారమే పరిహారం నిర్ణయిస్తే పిటిషనర్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని అభిప్రాయపడింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని భూసేకరణ నోటిఫికేషన్లను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. 

పిటిషనర్లు, అధికారులు పరస్పర ప్రయోజనాల నిమిత్తం పరిహారం, ఇతర పునరావాస చర్యలకు సంబంధించి చర్చలతో ఒక పరిష్కారానికి రావాలని సూచించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్‌ 15 కింద అభ్యంతరాలను మూడు నెలల వ్యవధిలోగా తీసుకోవాలని స్పష్టం చేసింది. మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది.