అయోధ్యలో జనవరి 24న రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ

అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రామమందిరం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 22, 2024న అయోధ్యలో కొత్తగా నిర్మించిన రామాలయంలో ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లాకు ‘ప్రాణ ప్రతిష్ఠ’ చేయనున్నారు. ఆలయ గర్భగుడి వద్ద రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 

136 సనాతన సంప్రదాయాలకు చెందిన 25 వేల హిందూ సాధవులను ప్రాణప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానించనున్నారు. పది వేల మంది ప్రత్యేక అతిధులు హాజరు కానున్నారు. అయోధ్యలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న రామాలయ గర్భగుడిలో జనవరి 21,22,23 తేదీల్లో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీరామ జన్మభూమి తీర్ధ్ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది.
 
‘రామజన్మ భూమి ప్రారంభోత్సవం వచ్చే ఏడాది జనవరి మూడో వారంలో నిర్వహిస్తాం. జనవరి 21 నుంచి 23 వరకు కార్యక్రమాలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని ప్రారంభోత్సవానికి ఆహ్వనిస్తాం. సాధువులు, ప్రముఖులను కూడా ఈ వేడుకలకు ఆహ్వానిస్తాం’ అని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.
 
ప్రముఖ సాధువుల, పలువురు ప్రతినిధులు కూడా హాజరుకానున్నారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. ప్రత్యేకంగా వేదిక, బహిరంగ సమావేశం ఉండదని స్పష్టం చేసారు.  ఆలయ ట్రస్టు ఆహ్వానితుల జాబితాను సిద్దం చేస్తోంది. త్వరలోనే ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నిత్య గోపాల్ దాస్ తరపున వారికి ఆహ్వాన లేఖలు పంపుతామని చెప్పారు. వీరికి అయోధ్యలోని ప్రముఖ మఠాల్లో వసతి కల్పిస్తామని చెప్పారు.
 
“అయోధ్యలోని పెద్ద మఠాలలో ప్రముఖ సాధువులందరికీ వసతి కల్పించాలని ట్రస్ట్ ప్లాన్ చేసింది” అని రాయ్ చెప్పారు. సాధువులు కాకుండా మరో పది వేల మంది ప్రత్యేక అతిధులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు వెల్లడించారు.  కరోనా మార్గదర్శకాల కారణంగా ఆలయ భూమి పూజ కార్యక్రమం ఆగస్టు 5, 2020న చాలా పరిమిత స్థాయిలో జరిగింది. ప్రస్తుతం “రాంలాలా గర్భగుడి ముగింపు దశకు చేరుకుంది. ఇప్పుడు జనవరి నెలలో ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి” అని ఆలయ ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తెలిపారు.
 
మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ శ్యామశీల రామ్ లల్లా ఈ విగ్రహాన్ని నిర్మించారు.  విగ్రహానికి సంబంధించిన తాత్కాలిక చిత్రాలను ఆలయ ట్రస్టు సభ్యులు సేకరించి ఖరారు చేశారు. రామ్‌ లల్లా విగ్రహంలో రాముడు ముఖం మీద మధురమైన చిరునవ్వుతో, చేతిలో విల్లుతో నిలబడి ఉంటాడు.  అలాగే కర్ణాటకలోని కర్కర్, హిగ్రీవన్‌కోట్ గ్రామాల నుంచి తీసుకొచ్చిన రాళ్లతో ఈ విగ్రహాన్ని నిర్మిస్తామని ఇంతముందే అధికారులు చెప్పారు. మైసూర్‌ శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ ఈ విగ్రహాన్ని తయారు చేసేందుకు అయోధ్య చేరుకున్నారు. విగ్రహ ప్రతిష్టాపన సమయం రాజకీయంగా కీలకమైంది.