రూ 160 కోట్లతో `సోలార్ సిటీ’గా అయోధ్య

ఓవైపు అయోధ్యలో శ్రీరాముడి గుడి నిర్మాణంతో పాటు మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టుల్ని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ శరవేగంగా చేపడుతున్నారు. ఇందులో భాగంగా రూ.160 కోట్లతో అయోధ్యలో నిర్మించే `సోలార్ సిటీ’ ప్రాజెక్టుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
ఆయోధ్యలో రూ.160 కోట్ల వ్యయంతో 40 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మించాలని యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు తాజాగా సమావేశమైన యూపీ మంత్రివర్గం  ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 70 మిలియన్ యూనిట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పాదనే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
 
ఈ భారీ ప్రాజెక్టు కోసం మజ్రా రాంపూర్ హల్వారా, మజ్రా సరాయిరాసీ గ్రామాల పరిధిలో 161 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భూసేకరణకు కూడా మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్టీపీసీకి చెందిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును నిర్మించబోతోంది. 
 
ఏడాదికి ఎకరానికి రూపాయి చొప్పున ఈ రెండు గ్రామాల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కోసం 165 ఎకరాల్ని లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయోధ్యలో ఈ సోలార్ ప్రాజెక్టు పూర్తయితే ఏడాదికి 70.08 మిలియన్ వాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. 
 
సౌరశక్తి ప్రాజెక్టు కావడంతో అతి తక్కువ ఖర్చుతునే దీన్ని ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను రాష్ట్ర పవర్ గ్రిడ్ కు పంపి అయోధ్య విద్యుత్ అవసరాలు తీరుస్తారు. ఈ సౌర విద్యుత్ ను యూపీ పవర్ కార్పొరేషన్ నిర్ణీత మొత్తానికే కొనుగోలు చేయబోతోంది.