ఓటమి భయంతో కేసీఆర్ టీఎస్ఆర్టీసీ విలీనం!

ప్రస్తుతం ఎవరి నుండి ఎటువంటి వత్తిడులు లేవు. ప్రభుత్వ పరంగా చెప్పుకోదగినంతగా కసరత్తు కూడా చేసిన దాఖలాలు లేవు.  నాలుగు సంవత్సరాల క్రితం 48,000 మందికి పైగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులు రాష్ట్ర రవాణా శాఖలో కార్పొరేషన్‌ను విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5 నుండి 52 రోజుల పాటు నిరవధిక సమ్మె చేశారు.

బహుశా ఆర్టీసీ చరిత్రలో ఇటీవల కాలంలో ఎన్నడూ అంతటి సుదీర్ఘ సమ్మె జరగలేదు. ఆ సమ్మెను అత్యంత పాశవికంగా కేసీఆర్ అణచివేశారు. పైగా, భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఆర్టీసీని విలీనం చేస్తున్నట్లు రాష్త్ర మంత్రివర్గం నిర్ణయించడం అధికార వర్గాలలోని ఆశ్చర్యం కలుగుతుంది. చివరకు బిఆర్ఎస్ వర్గాలు సహితం విస్తుపోతున్నాయి.

మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ రానున్నది. ఇప్పుడు ఇటువంటి కీలక నిర్ణయం తీసుకోవడం కేవలం రాజకీయ అవసరాలకోసమే అని స్పష్టం అవుతుంది. ఎన్నికల ముందు ప్రజలకు భారీ ఎత్తున హామీలు ఇవ్వడం, ఆ తర్వాత పట్టించుకోక పోవడం కేసీఆర్ కు పరిపాటిగా వస్తున్నది. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఉద్యోగ నియామకం వంటి హామీలను ఇంకా పూర్తి చేయకపోవడం తెలిసిందే.

ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్యెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతుంది. మరోవంక ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితులలో ఆర్టీసీ కార్మికులను దగ్గర చేర్చుకొనేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఉద్యోగులపై నిప్పులు చెరిగిన కేసీఆర్ వారిని సర్వీసు నుంచి తొలగించే స్థాయికి ఆ సమయంలో వెళ్లారు.

ఆ సందర్భంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకూడదని లోతుగా అధ్యయనం చేసిన రాష్త్ర మంత్రివర్గం గట్టిగా నిర్ణయించిందని, ఒకసారి మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే ఎవరూ మార్చలేరని కేసీఆర్ అప్పట్లో తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు, మంత్రివర్గం అందుకు విరుద్ధంగా నిర్ణయం ఏ విధంగా తీసుకోగలిగింది?

పైగా, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇతర కార్పొరేషన్ల ఉద్యోగుల నుంచి కూడా ఇదే డిమాండ్ వస్తుంది. ఇలా చిన్నవి,పెద్దవిగా 91 కార్పొరేషన్లు ఉన్నాయి. ఆర్టీసీని ఉదాహరణగా చూపిస్తూ వారు కూడా ఇదే డిమాండ్‌తో ముందుకు వస్తారు. ప్రభుత్వం వారి డిమాండ్లను తిరస్కరిస్తే, వారు కోర్టుకు వెళతారని అప్పట్లో కేసీఆర్ వాదించారు. 

అదే కోర్టులు ప్రభుత్వంపై తప్పులు వెతుకుతాయి కాబట్టి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని కేసీఆర్ ఎంతో స్పష్టంగా తేల్చి చెప్పారు.  కానీ అదే ముఖ్యమంత్రి ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కలంపోటుతో నిర్ణయం తీసుకున్నారు.  కేసీఆర్ ప్రతిపాదించిన వెంటనే ఎలాంటి చర్చ లేకుండానే కేబినెట్ ఆమోదం తెలిపింది.

కేసీఆర్ మనసులో హఠాత్తుగా ఈ మార్పు ఎందుకు వచ్చింది? రాష్ట్ర అసెంబ్లీకి మరో మూడు లేదా నాలుగు నెలల్లో జరుగనున్న ఎన్నికలు మాత్రమే అని స్పష్టం అవుతుంది.  పైగా, ప్రభుత్వ ఆస్తులను ఎక్కడికక్కడ అమ్మివేస్తూ ప్రభుత్వం పబ్బం గడుపుకొంటుంది. ఆర్టీసీకి సహితం ప్రతి చోటా విలువైన స్థలాలు ఉన్నాయి. వాటిని అమ్ముకొంటే వేలకోట్ల రూపాయల ఆదాయం పొందవచ్చని ఆలోచన కూడా ఉండవచ్చని ఉద్యోగ సంఘాలే అనుమానిస్తున్నాయి.

ఆర్టీసి కార్పొరేషన్‌గా ఉన్నంత కాలం ఇలాంటి ఆస్తులను కేసీఆర్ నేరుగా ఏమీ చేయలేక పోతున్నారు. ప్రభుత్వంలోవిలీనమైతే,ఆస్తులపై హక్కు పొందుతారు. దానితో అమ్ముకునేందుకు అడ్డు, అదుపు ఉండబోదు. ఏదేమైనా ఆర్టీసీని లాభదాయకంగా తీర్చి సిద్ధేందుకు కాకుండా, ఇతరత్రా ప్రయోజనాల కోసమే కేసీఆర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతుంది.