జులైలో రికార్డు స్థాయిలో రూ.1.60 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు

జులై నెలలో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో వసూలయ్యాయి. గత నెలలో జీఎస్టీ మొత్తం 1.65లక్షలు వసూలయ్యాయి. జీఎస్టీ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం ఇది వరుసగా ఐదోసారి. గత ఏడాది జులైతో పోలిస్తే ఈ ఏడాదిలో 11శాతం వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డేటా తెలిపింది. 
 
జులై నెలలో సీజీఎస్టీ రూ.29,773 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.37,623 కోట్లు. ఐజీఎస్టీ రూ.85,930 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 41,239 కోట్లతో కలిపి), సెస్‌ రూపేణా రూ.11,779. కోటి (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 840 కోట్లతో సహా) వసూలయ్యాయని ఆర్థిక మంత్రిత్వశాఖ పేర్కొంది. 
 
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిలో రూ.1,87,035 కోట్లకు చేరిన విషయం తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లు. నెలకు సగటున రూ.1.51లక్షల ఆదాయం సమకూరింది. 2022-23లో స్థూల రాబడి గతేడాది కంటే 22శాతం ఎక్కువ.
 

కాగా, 2023 జులైలో తెలంగాణ జిఎస్‌టి వసూళ్లు రూ.4,849 కోట్లతో వార్షికంగా 7 శాతం వృద్ధిని సాధించాయి. గతేడాది ఇదే సమయంలో రాష్ట్ర వసూళ్లు రూ.4,547 కోట్లు నమోదయ్యాయి. జులై జిఎస్‌టి వసూళ్లలో మహారాష్ట్ర టాప్- 5 రాష్ట్రాలలో అగ్రస్థానంలో ఉంది.  మహారాష్ట్ర జిఎస్‌టి వసూళ్లు గతేడాది కంటే 18 శాతం పెరిగి రూ.26,064 కోట్లుగా ఉన్నాయి. ఈ జాబితాలో రూ.11,505 కోట్ల వసూళ్లతో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇక రూ. రూ.10,022 కోట్ల వసూళ్లతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది.