విజయవాడలో అందుబాటులోకి ‘రోబోటిక్’ వైద్య సేవలు

ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా వివిధ వైద్య విభాగాలకు రోబోటిక్ సేవలను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ అందిస్తున్నది. నాల్గో తరానికి చెందిన డా విన్సీ × రోబోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోబోను ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ గురువారం ప్రారంభిస్తూ రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తో ఆంధ్రప్రదేశ్ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అందుకుందని చెప్పారు. 
 
మణిపాల్ హాస్పిటల్స్ వారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్ మెంట్ అనేది ఏపీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీతో రోగులకు ఖచ్చితత్వం ఉంటుందని చెప్పుకొచ్చారు. రోగులు త్వరగా కోలుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. 
 
ఈ సాంకేతిక ఆవిష్కరణతో శస్త్రచికిత్సా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని తెలిపారు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలతో భారతదేశ వైద్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మణిపాల్ హెల్త్ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్ డా.సుదర్శన్ బల్లాల్ మాట్లాడుతూ ఈ విప్లవాత్మకమైన సర్జికల్ విధానాన్ని ప్రారంభించడం ద్వారా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఇది కేవలం విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సేవలను అందిపుచ్చుకోవాలని చెప్పారు.