అమెరికా నిషేధంతో ఇరాక్ కరెన్సీ పతనం

సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇరాక్‌తో పాటు పలు సెంట్రల్‌ బ్యాంకుల ఎదుట ప్రజలు భారీ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. 2021 నుండి భారీ ఆందోళనలు చేపడుతున్న ‘తువార్‌ తిష్రీన్‌ (అక్టోబర్‌ రివల్యూషనరీస్‌)’ నేతృత్వంలో ఈ నిరసన ప్రదర్శనలు జరిగాయి. దేశంలో ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని వారు పిలుపునిచ్చారు.

14 ఇరాక్‌ బ్యాంకులను అమెరికా బ్లాక్‌ లిస్ట్‌లో చేర్చడంతో ఇరాక్‌లో ఒక్కసారిగా దినార్‌ విలువ పడిపోయింది. దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటూ 14 బ్యాంకులు ఓ ప్రకటన విడుదల చేశాయి.అమెరికా విధించిన నిషేధం కేవలం డాలర్‌ ధరపై మాత్రమే ప్రభావం చూపదని, విదేశీ నిధుల ప్రవాహంపై కూడా పరిమితిని విధిస్తుందని బాగ్దాద్‌లోని ఓ ప్రైవేట్‌ బ్యాంక్‌ యజమాని హైదర్‌ అల్‌ శర్మ తెలిపారు. 

అమెరికా విధించిన నిషేధంతో పలు ప్రతికూల పరిణామాలను ఎదుర్కోవలసి వుంటుందని హెచ్చరించారు. ప్రైవేట్‌ బ్యాంకుల నష్టాన్ని పూడ్చేందుకు, బ్యాంకులు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు, ఇరాక్‌లోని బ్యాంకింగ్‌ రంగాన్ని సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  

బ్యాంకులు ఆడిట్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రాజకీయ ఉద్రిక్తతలతో బ్యాంకులకు సంబంధం లేదని, బ్యాంకులన్నీ స్వతంత్ర సంస్థలేనని స్పష్టం చేశారు.  ఇరాన్‌ కు  నిధులను  మళ్లించడంతో  పాటు మనీలాండరింగ్‌కి పాల్పడ్డాయన్న ఆరోపణలతో    ప్రైవేట్‌ బ్యాంకులను దినార్‌తో డాలర్ల మారకంపై అమెరికా నిషేధం విధించింది. గతంలోని బ్యాంకులతో పాటు తాజాగా ఎనిమిది బ్యాంకులపై అమెరికా ఆంక్షలు విధించింది.

ఇరాక్‌లోని 72 బ్యాంకులలో సుమారు మూడో వంతు బ్లాక్‌లిస్ట్‌లో చేర్చినట్లు ఇద్దరు ఇరాక్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధికారులు తెలిపారు. దీంతో మార్కెట్‌లో మారకపు రేటు అధికమైంది. గడిచిన రెండు రోజుల్లో డాలర్‌కి 1,470గా ఉండే దినార్‌ మారకం  డాలర్‌కి 1,570 దినార్‌లకు చేరింది. 

కొందరు వ్యాపారులు సెంట్రల్‌ బ్యాంక్‌ వంటి అధికారిక ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా బ్లాక్‌ మార్కెట్‌లో కరెన్సీ మారకాన్ని చేపడుతున్నారని సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ అలి-అల్‌-అల్లాక్‌ పేర్కొన్నారు. డాలర్‌తో దినార్‌ను స్థిరీకరించే చర్యలపై చర్చించేందుకు తాను గత ఆదివారం ఇరాక్‌ ప్రధాని మహమ్మద్‌ షియా అల్‌ – సుదానీతో సమావేశమయ్యానని చెప్పారు.