చైనా కట్టడికే వియత్నాంకు యుద్ధ నౌక

పక్కలో బళ్లెంలా మారిన చైనా దూకుడును తగ్గించడానికి అందివచ్చిన అవకాశాలను భారత్‌ వినియోగించుకుంటున్నది. తనతో స్నేహపూర్వంగా ఉండే దేశాలకు సహాయం చేస్తూ వస్తున్నది. ఇందులో భాగంగా చైనా పొరుగు దేశమైన వియత్నాంకు యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ను అందించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి గుర్తుగా 32 ఏండ్లుగా ఇండియన్‌ నేవీకి సేవలందిస్తున్న ఈ యుద్ధ నౌకను కానుకగా ఇచ్చింది.
ఆ దేశ పర్యటనలో ఉన్న భారత నౌకాదళాధిపతి అడ్మిరల్‌ ఆర్‌.హరి కుమార్‌ వియత్నాం పీపుల్స్‌ నేవీకి ఈ యుద్ధనౌకను అప్పగించారు.  ఇలా సేవలందించే ఓ యుద్ధనౌకను భారత్‌ తన మిత్రదేశానికి బహుమతిగా ఇవ్వడం ఇది మొదటిసారి కావడం విశేషం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాలకుఇదొక నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.  దీంతో దక్షిణ చైనా సముద్రమంతా తనదేనంటూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ డ్రాగన్‌ను కట్టడిచేసేలా వియత్నాంకు భారత్‌ సహాయం చేసినట్లయింది.
 
కాగా, దేశీయంగా రూపొందించిన ఐఎన్‌ఎస్‌ కృపాణ్‌ను 1991లో ప్రారంభించారు. 90 మీటర్ల పొడవు, 10.45 మీటర్ల వెడల్పు, 1450 టన్నుల బరువున్న ఈ ఖుక్రీ క్లాస్‌ క్షిపణి యుద్ధనౌకలో సుమారు 12 మంది అధికారులు, వంద మంది నావికులు పనిచేస్తారు. దీనికి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం ఉన్నది.