ఇక శ్రీలంకలో కూడా యూపీఐ ద్వారా చెల్లింపులు

భారత్ కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేజ్ (యూపీఐ) కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. తాజాగా, శ్రీలంకలో కూడా యూపీఐ చెల్లింపులకు అనుమతి లభించింది. యూపీఐ చెల్లింపుల  ప్రయోజనాలు అన్ని సభ్య దేశాలకు లభించేలా చూస్తామని భారత్ హామీ ఇస్తోంది.

శ్రీలంక అధ్యక్షుడు రణిల విక్రమసింఘె భారత పర్యటన సందర్భంగా కుదిరిన పలు ఒప్పందాల్లో ఈ యూపీఐ చెల్లింపులకు సంబంధించిన ఒప్పందం ఒకటి. భారత ప్రధాని మోదీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల విక్రమసింఘెల సమక్షంలో ఢిల్లీలో ఈ ఒప్పందం కుదిరింది. భారత్ లో యూపీఐ పేమెంట్స్ సిస్టమ్ విస్తృత ప్రజాదరణ పొందింది.

ఇప్పటివరకు ఫ్రాన్స్, యూఏఈ, సింగపూర్ దేశాల్లో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి అనుమతి ఉంది. ఆ మేరకు ఆ దేశాలతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. యూపీఐ చెల్లింపులకు అనుమతి లభించిన నాలుగో దేశం శ్రీలంక. ఈ నాలుగు దేశాల ప్రజలు పరస్పరం యూపీఐ పేమెంట్స్ సిస్టమ్స్ ద్వారా డబ్బు చెల్లింపులు చేసుకోవచ్చు.

యూపీఐ భారత్ కు చెందిన మొబైల్ నంబర్ ఆధారిత పేమెంట్ సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా ఎప్పుడైనా, ఏదైనా బ్యాంక్ ఖాతాతో అనుసంధానమై ఉన్న ఎవరి మొబైల్ నంబర్ కు అయినా డబ్బులు పంపించవచ్చు. వారి నుంచి డబ్బులను స్వీకరించవచ్చు. ఈ లావాదేవీలకు క్యూఆర్ కోడ్ లను కూడా ఉపయోగించవచ్చు.

2023 ఫిబ్రవరిలో సింగపూర్ తో, ఇటీవలి ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఫ్రాన్స్, యూఏఈలతో యూపీఐ చెల్లింపులకు సంబంధించి భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. యూఏఈతో కుదిరిన ఒప్పందంలో భాగంగా యూఏఈకి చెందిన ప్రత్యేక పేమెంట్స్ సిస్టమ్ ఇన్ స్టంట్ పేమెంట్స్ ప్లాట్ ఫామ్ (ఐపిపి)తో భారత్ కు చెందిన యూపీఐ అనుసంధానిస్తారు.