తొలిసారి తాజ్‌మహల్‌ను తాకిన యమునా వరద

ఉత్తరాది రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో ఆయా రాష్ట్రాల్లోని నదులు, వాగులు, వంకల్లో వరద నీరు పొంగిపొర్లుతున్నది. యమునా నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దాంతో గడిచిన 45 ఏళ్లలో తొలిసారిగా చారిత్రక కట్టడమైన తాజ్‌ మహల్‌ పరిసరాల్లోకి యమునా నది వరద నీరు ప్రవేశించింది. తాజ్‌మహల్ గోడల్లో, గార్డెన్‌లో భారీగా వరదనీరు నిలిచింది.

ఆదివారం రాత్రి తాజ్‌మహల్ దగ్గర యమునా నది వరద గరిష్ఠ స్థాయి అయిన 495 అడుగులను దాటి 497.9 అడుగులకు చేరింది. దాంతో వరదనీరు తాజ్‌మహల్‌ పరిసరాల్లోకి ప్రవేశించింది. అయితే ఈ వరదనీరు వల్ల తాజ్‌మహల్‌కు వచ్చిన ముప్పేమీ లేదని ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్‌ ఇండియా వాళ్లు ప్రకటించారు.

కాగా, కుండపోత వర్షాలవల్ల యమునా నదిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. పలు ప్రాంతాల్లో వరద నీరు పొంగిపొర్లింది. దాంతో యమునా పరివాహకంలోని పలు లోతట్టు ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. అదేవిధంగా ఇతిమాద్‌ ఉద్‌ దౌలా టూంబ్‌ పరిసరాల్లోకి, దుసెరా ఘాట్‌ సమీపంలోకి వరద నీరు వచ్చి చేరింది.

ఢిల్లీ లో యమునా నది మరోసారి ఉగ్రరూపం దాల్చింది. డేంజర్ మార్క్ ను దాటి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. మొన్నటి వరకూ యమున ఉప్పొంగడంతో జరిగిన నష్టం నుంచి కోలుకోకముందే మరోసారి యమునమ్మ ఉగ్రరూపం దాల్చడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఉదయం 8 గంటల సమయానికి ఢిల్లీ పాత రైల్వే వంతెన వద్ద యమునా నది నీటి మట్టం డేంజర్ మార్క్ ను దాటి 205.48 మీటర్లుగా నమోదైంది. ఈ సాయంత్రానికి ఇది 205.72 మీటర్లకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

 గతంలో 1978లో యమునా నది వరదలవల్ల తాజ్‌ మహల్‌ తీవ్రంగా ప్రభావితమైంది. దాదాపు 508 అడుగుల ఎత్తులో యమునా నది ప్రవహించడంతో తాజ్‌మహల్‌ బేస్‌మెంట్‌లోని 22 గదుల్లోకి వరద నీరు ప్రవేశించింది. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకున్నా తాజ్‌మహల్ పరిసరాల్లోకి వరదనీరు రావడం ఇదే తొలిసారి.

మరోవంక, ఢిల్లీలో అనేక ప్రాంతాలు యమునా నది వరదలో మునిగి తేలుతుండగా మంగళవారం మరికొన్ని ప్రాంతాలు వర్షాలకు జలమయమయ్యాయి. లజపత్ నగర్, దక్షిణ ఢిల్లీ లోని తూర్పు కైలాష్ ఏరియా, దక్షిణ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, ఢిల్లీ సెక్రటేరియట్ ఏరియాల్లో వర్షాలు కురిశాయి. మంగళవారం ఓ మోస్తరు వర్షాలు కురిశాయని వాతావరణ విభాగం పేర్కొంది. నగరంలో కనిష్ఠ ఉష్ణోగ్రత 27.4 డిగ్రీల సెంటిగ్రేడ్ కాగా, ఉదయం తేమ స్థాయి 89 శాతం నమోదైంది. సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత సీజన్ సరాసరి ఉష్ణోగ్రత కన్నా తక్కువగా 26.4 డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది.