స్విమ్స్ లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ చికిత్స

శ్రీ వెంకటేశ్వర వైద్య శాస్త్రాల సంస్థ(స్విమ్స్)లో ఏర్పాటు చేస్తున్న శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ (క్యాన్సర్ హాస్పిటల్)లో అన్ని రకాల క్యాన్సర్లకు అత్యుత్తమ వైద్య చికిత్సలు అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తామని టీటీడీ ఈవో  ఎవి ధర్మారెడ్డి చెప్పారు. ఇందుకోసం అత్యాధునిక వైద్య వ్యవస్థను అందుబాటులోకి తెచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు.

తిరుపతి జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, (సి హెచ్ ఓ)మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు (ఎం ఎల్ హెచ్ పి) లకు శ్రీ పద్మావతి మహిళా వైద్య కళాశాలలో జూలై 13 నుంచి 22వ తేదీ వరకు క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ పరీక్షలపై నిర్వహిస్తున్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొంటూ క్యాన్సర్ వల్ల దేశంలో ఏటా 7 లక్షల మంది చనిపోతున్నారని చెప్పారు. 

క్యాన్సర్ ను తొలి దశలోనే గుర్తించడం, సరైన చికిత్స అందించడం ఈ సమస్యను అధిగమించడానికి మార్గాలని ధర్మారెడ్డి తెలిపారు.  రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులతో పండిస్తున్న ఉత్పత్తులవల్ల ఆ అవశేషాలు మానవ శరీరంలోకి వెళ్లి క్యాన్సర్ రావడానికి మరో కారణం అవుతున్నాయని పేర్కొన్నారు. 

దీంతోపాటు రోజుకు పెరిగిపోతున్న ఫాస్ట్ ఫుడ్ అలవాట్లు కూడా క్యాన్సర్ ప్రబలడానికి కారణమవుతున్నాయని చెప్పారు. మానవులు రోగాల బారిన పడకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ రకమైన జీవనవిధానం అలవర్చుకోవాలనే విషయాలు పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో వివరించారని చెప్పారు. 

యోగా ద్వారా మెదడును బలోపేతం చేసుకుంటే శరీరాన్ని నియంత్రించుకోవచ్చని చెబుతూ ప్రాణాయామం, యోగా కు సంబంధించి శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం ఆచార్యుల చేత మరో శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు. గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులను ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ ను దూరం చేయవచ్చునని ఈవో చెప్పారు.