కేరళ మాజీ సీఎం ఊమెన్‌ చాందీ కన్నుమూత

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ కన్నుమూశారు.   రాజకీయ కురువృద్ధుడిగా, విశ్వాసపాత్రుడుగా కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా పేరొందారు. కేరళ రాజకీయాల్లో నిజాయితీ, నిబద్ధతకు మారుపేరుగా నిలిచిన ప్రజల మనిషిగా పేరొందారు.  79 ఏండ్ల ఊమెన్‌ చాందీ గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
దీంతో బెంగళూరులోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.  అయితే పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు చాందీ ఊమెన్‌ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు.   1943, అక్టోబర్‌ 31న ఊమెన్‌ చాందీ జన్మించారు. 12 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ఊమెన్‌ చాందీ కేరళ ముఖ్యమంత్రిగా రెండుసార్లు పనిచేశారు.
ఈయనకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. 1970లో మొదటిసారి పూతుపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సాధారణ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన చాందీ  నిజాయితీ, నిబద్ధతతో విశ్వాసపాత్రుడిగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.  రెండుసార్లు కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2006 వరకు ఒకసారి, 2011 నుంచి 2016 వరకు రెండోసారి కేరళ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు కేరళ ప్రధాన ప్రతిపక్షనేతగా ఉన్నారు. 2018 నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. 
 
అంతేకాదు కె. కరుణాకరన్, ఏకే ఆంటోని హయాంలో ఆర్థిక శాఖమంత్రిగా, హోం మంత్రిగా, కార్మికశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర ప్రజలతో మొదట్నుంచీ మంచి అనుబంధం ఉన్న మాస్‌ లీడర్‌ అని కాంగ్రెస్ శ్రేణులు చెప్పుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత 2018లో ఏపీ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేశారు.
ప్రజాసేవకు గానూ ఐక్యరాజ్యసమితి నుంచి అవార్డు అందుకున్న ఏకైక భారతీయ సీఎం చాందీనే కావడం విశేషమని చెప్పుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి మృతిపట్ల కేరళ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కే. సుధాకరణ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. కాంగ్రెస్‌ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని చెప్పారు.