విజయవంతంగా చంద్రయాన్‌-3 స్పేస్‌ క్రాఫ్ట్‌ కక్ష్య పెంపు

చందమామను శోధించేందుకు జూలై 14న భూమి నుంచి బయలుదేరిన చంద్రయాన్‌-3 మిషన్‌ ప్రయాణం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల పర్యవేక్షణలో స్పేస్‌ క్రాఫ్ట్‌ విజయవంతంగా ప్రయాణం సాగిస్తున్నది.  ప్రయోగంలో భాగంగా ఇప్పటికే ఒకసారి మిషన్‌ కక్ష్యను పెంచిన ఇస్రో శాస్త్రవేత్తలు, సోమవారం రెండోసారి మూన్‌ మిషన్‌ కక్ష్య పెంపు ప్రక్రియను విజయవంతంగా పూర్తిచేశారు.

భారత్‌ పంపిన స్పేస్‌ క్రాఫ్ట్‌ ప్రస్తుతం భూమికి 41,603 కిలోమీటర్లు X 226 కిలోమీటర్ల దూరంలోగల కక్ష్యలో ఉన్నది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల మధ్య మరోసారి స్పేస్‌ క్రాఫ్ట్‌ ఇంజిన్‌లను మండించి కక్ష్యను మరింత పెంచనున్నారు. ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం మధ్యాహ్నం ఈ వివరాలను వెల్లడించారు.

కాగా, చంద్రుడిపై పరిశోధన కోసం ఇస్రో ఈ నెల 14న చంద్రయాన్‌-3 మిషన్‌ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. దాదాపు 40 రోజులకుపైగా సుదీర్ఘ ప్రయాణం అనంతరం అంటే ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ఆ స్పేస్‌క్రాఫ్ట్‌ చందమామపై దిగనుంది. కాగా, చంద్రయాన్‌-3 ప్రయోగం మొత్తంలో రోవర్‌ను చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా దించడమే తమ ముందున్న అసలైన సవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.