వందేభారత్‌ రైలులో మంటలు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైల్లో మంటలు చెలరేగడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. మధ్యప్రదేశ్ కుర్వాయి కేథోరా రైల్వే స్టేషన్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులంతా ఆందోళనకు గురయ్యారు.
హుటాహుటిన ట్రైన్ నుంచి దిగిపోయారు. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.  అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంత ఊపిరి పీల్చుకున్నారు.  సోమవారం ఉదయం  భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న రాణి కమలాపతి (భోపాల్)-హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
రైలు ఇంజిన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలట్ కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశాడు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చున్నారు.
 
ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని.. ఎలాంటి గాయాలు కాలేదని రైల్వే శాఖ ప్రకటించింది. తొలుత బ్యాటరీ బాక్సులో మంటలు చెలరేగాయని, ఫైర్ సిబ్బంది తక్షణమే రంగంలోకి దిగి వాటిని ఆర్పివేశారని పేర్కొంది. అన్ని విషయాలను పరిశీలించిన తర్వాత రైలు బయలుదేరుతుందని వెల్లడించింది.