చంద్రయాన్‌-3 తొలి అడుగు విజయవంతం

జాబిల్లి రహస్యాలను ఛేదించేందుకు భారత అంతరిక్ష పరిశోధ సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్‌-3 తొలి అడుగు విజయవంతమైంది. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్‌ కాలుమోపుతుంది. 40 రోజుల తర్వాతే శాస్త్రవేత్తలకు అసలైన సవాలు ఎదురవుతుంది.

శనివారం చంద్రయాన్‌-3 కక్ష్యను మార్చామని ఇస్రో వెల్లడించింది. ప్రస్తుతం ఈ మిషన్‌ సజావుగా తనకు నిర్దేశించిన మార్గంలో పయనిస్తోందని వెల్లడించింది. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌, ల్యాండర్‌ మాడ్యూల్‌, రోవర్లను దేశీయంగా అభివృద్ధి చేశారు. ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ బరువు 2,148 కేజీలు కాగా, ల్యాండర్‌ విక్రమ్‌ బరువు 1,723.89, రోవర్‌ ప్రజ్ఞాన్‌ బరువు 26 కేజీలు. 

చంద్రుడి సమీపంలోకి చేరుకున్న తర్వాత ల్యాండర్‌-రోవర్‌.. పేలోడ్‌ ప్రొపల్షన్‌ నుంచి విడిపోయి ల్యాండ్‌ అవుతుంది. ఆపై రోవర్‌ ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై కలియదిరుగుతూ పరిశోధనలు ప్రారంభిస్తుంది. చంద్రయాన్‌-3 మూన్‌కేక్స్‌, చంద్రుడి నేల కూర్పు, వాతావరణంపై అధ్యయనం చేస్తుంది. సేకరించిన సమాచారాన్ని డిజిటలైజ్‌ చేసి చంద్రుడి చుట్టూ తిరుగుతున్న ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ రిసీవర్‌కు పంపుతుంది. 

అక్కడి నుంచి అది శాస్త్రవేత్తలకు చేరుతుంది. చంద్రుడి కంపనాలపై అధ్యయనం చేసే ప్రజ్ఞాన్‌ ఫొటోగ్రాఫ్‌లను కూడా పంపుతుంది. ఉపరితలంపై ఓ ముక్కను కరిగించేందుకు, ఈ ప్రక్రియలో విడుదలయ్యే వాయువులను పరిశీలించేందుకు ప్రజ్ఞాన్‌ లేజర్‌ కిరణాలను ఉపయోగిస్తుంది. చారిత్రాత్మక చంద్రయాన్‌-3 ప్రయోగంలో తొలి అడుగు విజయవంతమైందని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌ డైరెక్టర్‌ ఎస్‌ ఉన్నికృష్ణన్‌ నాయర్‌ తెలిపారు.

తిరువనంతపురంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ లాంచ్‌ వెహికల్‌ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అంతరిక్షనౌకకు అవసరమైన ప్రారంభ పరిస్థితులను చాలా కచ్చితంగా అందించినట్టు తెలిపారు. తొలి అడుగు వంద శాతం విజయవంతం కావడంతో తుది అడుగు కూడా విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధన చేపట్టడం ఈ మిషన్‌ ప్రధాన ఉద్దేశం. ఈ క్రమంలో చంద్రయాన్‌-3లోని లాండర్‌ విజయవంతంగా చంద్రుడిపై దింపాలని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృష్టి చేస్తున్నారు. ల్యాండర్‌ సాయంతో చంద్రుడి దక్షిణ ధ్రువపు రహస్యాలను వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నారు