హైదరాబాద్‌లో బిజెపి నేత తిరుపతిరెడ్డి కిడ్నాప్!

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ, రియల్ ఎస్టేట్ వ్యాపారి తిరుపతి రెడ్డి కిడ్నాప్ కు గురయ్యారు. హైదరాబాద్ లోని ఆల్వాల్ లో ఆయనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన భర్త కిడ్నాప్ కు గురైనట్టు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిరుపతి రెడ్డిది జనగామ జిల్లా దుబ్బకుంటపల్లి. హైదరాబాద్ లోని కుషాయిగూడలో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు.
5,929 గజాల భూమి విషయంలో ప్రత్యర్థులతో ఆయనకు వివాదం ఉందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. నిన్న మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆల్వాల్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఆయనను కిడ్నాప్ చేశారని తెలిపారు.  తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఆయన ఫోన్ పని చేయడం లేదని చెప్పారు. ప్రత్యర్థులే ఆయనను కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు.
బీజేపీలో క్రియాశీల పాత్ర  పోషిస్తున్న తిరుపతి రెడ్  జనగామ నుండి పోటీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. డ్రైవర్‌ పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తిరుపతిరెడ్డి అక్కడ కనిపించకుండా పోయారు. అతడి రెండు ఫోన్లు కూడా స్విచ్‌ ఆఫ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన భార్య సుజాత అల్వాల్‌ పోలీసులకు రాత్రి ఫిర్యాదు చేశారు.మామిడి జనార్ధన్ రెడ్డి అనే వ్యక్తిపై కుటుంభం సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తిరుపతిరెడ్డికి చెందిన మూడు ఎకరాల భూమిని అతను కబ్జాకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అతనిపై మూడు కమిషనరేట్ల పరిధిలో 15 భూకబ్జా కేసులు నమోదై ఉన్నాయి. అతనిపై పిడి ఆక్ట్ అమలు చేయాలని ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీచేశారు.

మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అండదండలతోనే  జనార్దన్ రెడ్డి భూకబ్జాలకు పాల్పడుతున్నారని తిరుపతిరెడ్డి కుటుంభం సభ్యులు ఆరోపిస్తున్నారు. తన భర్తకు ఎటువంటి హాని జరిగినా ఎమ్మెల్యే మైనంపల్లి, జనార్దన్ రెడ్డిలే బాధ్యులని తిరుపతి రెడ్డి భార్య సుజాత స్పష్టం చేస్తున్నారు.