లూనాతో పంట చేనులో వ్యవసాయ పనులు

లూనాతో పంట చేనులో వ్యవసాయ పనులు
పొలం పనుల కోసం ఇప్పుడు కూలీలను భరించడం, పశువులను పోషించడం సన్నకారు రైతులకు తలకు మించిన భారంలా మారింది. ట్రాక్టర్ ఉపయోగిద్దామనుకొంటే అద్దె అందుబాటులో ఉండటం లేదు. దానితో ఓ రైతు వినూత్న ఆలోచనతో కొడుకు సహాయంతో లూనాను ఉపయోగించి పొలం పనులు చేసుకునే ప్రయత్నం అందరిని ఆకట్టుకొంటోంది.

నిర్మల్ జిల్లా ముథోల్ కు చెందిన రైతు సొంకాంబ్లీ బాబు దుక్కులు దున్నేందుకు ఎద్దుల కొరతతో యంత్రాలతోనైనా సాగు చేద్దామనుకున్నాడు. ట్రాక్టర్ల కోసం ప్రయత్నం చేసినా సీజన్ కావడంతో ట్రాక్టర్లు రేట్లు దండిగా పెంచేశారు. చేసేది లేక ఇదిగో ఇలా ఇంటి వాహనాన్నే వ్యవసాయానికి సాయంగా వాడేశాడు. ముదోల్ మండల కేంద్రానికి చెందిన సొంకాంబ్లీ బాబు అనే రైతు తన పంట చేనులో వేసిన పత్తి పంటలో గుంటుకు కొట్టడానికి వినూత్నంగా ఆలోచించాడు.

తనకున్న లూనాతో పంట చేనులో వ్యవసాయ పనులు చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. లూనాను ఇలా వ్యవసాయ పనులకు వాడటంతో ఇదేదో బాగుందే అంటూ ఆ ప్రాంత రైతులు కూడా అదే బాటపట్టారట. అదిరిందయ్యా కాంబీ అంటూ బాబును పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారట. విభిన్నమైన ఆలోచనలతో వినూత్న పనులు చేపట్టవచ్చని నిరూపించిన రైతు సొంకాంబ్లీని సమీప ప్రాంత రైతులు అభినందిస్తున్నారు.

గుంటుకు కొట్టడానికి ఎడ్లు లేకున్నా తన లూనాను ఉపయోగించి వ్యవసాయ పనులు పూర్తి చేయడంతో ఖర్చు కలిసి వచ్చిందంటున్నాడు కాంబ్లీ. ఎకరంన్నర భూమిలో వేసిన పత్తిలో ఇంటి పనులకు వాడే లూనాను ఇలా గుంటుకు కొట్టడానికి వాడక తప్పలేదని తెలిపాడు. తన కొడుకు సాయం కూడా ఆర్థిక ఇబ్బందులను గట్టెక్కేలా చేసిందని తెలిపాడు.