సమాన వారసత్వ హక్కులు కోరుతున్న 82% ముస్లిం మహిళలు

నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభించడంతో ఈ విషయమై జాతీయ స్థాయిలో రాజకీయంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అత్యధికులు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు దీన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఉమ్మడి పౌరస్మృతిCకి సంబంధించి భారతదేశంలోని 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఇటీవల న్యూస్‌18 నెట్‌వర్క్‌ ఓ సర్వే నిర్వహించింది.
ఇందులో దాదాపు 8,035 మంది ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ముస్లిం సమాజంలో పురుషులతో పాటు మహిళలకు సమాన వారసత్వ హక్కులు ఉండాలని సర్వేలో 82% మంది అభిప్రాయపడ్డారు. వివాహం, విడాకులు, వారసత్వం, దత్తత వంటి అంశాలకు సంబంధించి అన్ని మతాలకు వర్తించే ఒకే చట్టాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదిత చట్టం, ఉమ్మడి పౌరస్మృతిపై ముస్లిం మహిళల ఉద్దేశాలు తెలుసుకునేందుకు ఈ సర్వే నిర్వహించారు. 
సర్వేలో పాల్గొన్న 82 శాతం మంది ముస్లిం మహిళలు పురుషులు, స్త్రీలకు వారసత్వం, ఆస్తి వారసత్వంలో సమాన హక్కులు ఉండాలని చెప్పారు. కేవలం 11% మంది ఈ ఆలోచనను వ్యతిరేకించారు. అయితే 7% మంది దీనిపై అస్పష్టంగా ఉన్నారు లేదా ఎలాంటి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు వంటి ఉన్నత విద్యార్హతలు కలిగిన మహిళల్లో సమాన హక్కులకు అనుకూలంగా ఉన్న వారి శాతం 86 శాతానికి పెరిగింది. 18-44 వయస్సు గలవారు అత్యధిక స్థాయిలో మద్దతు తెలిపారు. వీరిలో 84% సమాన వారసత్వ హక్కులను ఆమోదించారు.

ఈ సర్వేలో 18-24 ఏళ్ల మధ్య వయసున్న వారు 19 శాతం ఉన్నారు. 25-34 ఏళ్ల మధ్య వయసున్న వారు 33 శాతం పాల్గొన్నారు. 35-44 ఏళ్ల మధ్య 27%, 45-54 ఏళ్ల మధ్య వయసున్న 14%, 55-64 ఏళ్ల మధ్య వయసున్న 5%, 65 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు 2% ఉన్నారు.  అన్ని వయో వర్గాల మహిళలు సర్వేలో భాగమయ్యారు.

వైవాహిక స్థితి పరంగా 70% మంది వివాహితులు, 24% అవివాహితులు, 3% వితంతువులు, 3% విడాకులు తీసుకున్నవారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. సర్వేలో పాల్గొన్న మహిళల్లో 11% పోస్ట్-గ్రాడ్యుయేట్ డిగ్రీలు, 27% గ్రాడ్యుయేట్లు, 21% మంది 12వ తరగతి వరకు పూర్తి చేసినవారు ఉన్నారు. 

14% మంది 10వ తరగతి వరకు విద్యను పూర్తి చేసినవారు, 13% మంది 5-10వ తరగతి వరకు చదివినవారు తమ అభిప్రాయాలు తెలియజేశారు. 4% మంది 5వ తరగతి వరకు చదివిన వారు ఉన్నారు. 4% మంది నిరక్షరాస్యులు, 4% ప్రాథమిక అక్షరాస్యత నైపుణ్యాలను కలిగి ఉన్నారు. మతపరంగా చూస్తే.. 73% మంది సున్నీలు, 13% మంది షియాలు ఉన్నారు. 14% మంది ముస్లిం కమ్యూనిటీలోని ఇతర వర్గాలకు చెందినవారు.

సమాన వారసత్వం, వారసత్వ హక్కుల కోసం ముస్లిం మహిళల నుంచి లభించిన మద్దతు,  ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకతను తెలుపుతోంది. మగ వారసులకు అనుకూలంగా ఉండే నిబంధనలు, నియమాలను విశ్వవ్యాప్తంగా ఆమోదిస్తున్నారనే ఊహను సర్వే ఫలితాలు సవాలు చేస్తున్నాయి. ఇది ముస్లిం స్త్రీలలో, ముఖ్యంగా ఉన్నత విద్యాభ్యాసం, చిన్న వయస్సు వర్గాల నుంచి లింగ సమానత్వం కోసం పెరుగుతున్న అవగాహన, డిమాండ్‌ను వెల్లడి చేస్తుంది.