గుజరాత్ హైకోర్టులో రాహుల్ గాంధీకి చుక్కెదురు

మోదీ ఇంటి పేరు వివాదానికి సంబంధించిన కేసు వ్యవహారంలో రాహుల్​ గాంధీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది! పరువు నష్టం కేసులో తనకు వ్యతిరేకంగా వచ్చిన తీర్పుపై స్టే విధించాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత చేసుకున్న అభ్యర్థనను గుజరాత్​ హైకోర్టు తాజాగా తిరస్కరించింది. ఫలితంగా రాహుల్​ గాంధీపై పడిన అనర్హత వేటు కొనసాగనుంది. 
 
అయితే గాంధీకి విధించిన రెండేళ్ల శిక్షపై ఇప్పటికే స్టే ఉండటంతో ఆయన జైలుకు వెళ్లరు. 2019లో మోదీ ఇంటిపేరుపై రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనకి వ్యతిరేకంగా సూరత్​ కోర్టులో ఓ పిటిషన్​ దాఖలైంది. ఈ ఏడాది మార్చ్​లో ఈ వ్యవహారంపై సంచలన తీర్పును వెలువరించింది సూరత్​ కోర్టు. 
 
రాహుల్​ గాంధీని దోషిగా తేల్చుతూ రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎవరైనా ఎంపీగా ఉంటూ, కేసులో దోషిగా తేలితే వారిపై అనర్హత వేటు పడుతుంది. కాంగ్రెస్​ సీనియర్​ నేతకు కూడా ఇదే జరిగింది. ఆయన తన వయనాడ్​ సీటును కోల్పోయారు. మరోవైపు కొన్ని రోజుల తర్వాత సూరత్​ కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ గుజరాత్​ హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు రాహుల్​ గాంధీ.
మే నెలలో విచారణ చేపట్టిన హైకోర్టు రెండేళ్ల జైలు శిక్షపై స్టే విధించింది. కానీ అనర్హత వేటు విషయంలో ఉపశమనాన్ని కల్పించేందుకు నిరాకరించింది. తమ తీర్పును వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది. చివరికి తాజాగా ఈ వ్యవహారంపై తీర్పును వెలువరించింది గుజరాత్​ హైకోర్టు.

 “రాహుల్ గాంధీపై 10కిపైగా క్రిమినల్​ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం దోషిగా తేలిన కేసు తర్వాత కూడా పలు కేసులు దాఖలయ్యాయి. వీర్​ సావర్కర్​ మనవడు కూడా కేసు వేశారు. ఏదిఏమైనా.. మోదీ ఇంటి పేరు వివాదంలో పడిన శిక్షతో రాహుల్​ గాంధీకి అన్యాయం జరిగింది అనడానికి ఏం లేదు! ఈ తీర్పు సరైనదే. సూరత్​ కోర్టు ఆదేశాలపై జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే ఆయన పిటిషన్​ను తిరస్కరిస్తున్నాము,” అని గుజరాత్​ హైకోర్టు తీర్పునిచ్చింది.

గుజరాత్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై రాహుల్ గాంధీ ఇప్పుడు డివిజన్ బెంచ్ కు అప్పీలు చేసుకునే అవకాశం ఉంది. అక్కడా కుదరకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయి. వచ్చేఏడాది సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రాహుల్ గాంధీకి ఈ కేసు సమస్యగా మారింది. ఈ కేసులో కోర్టులు రాహుల్ జైలుశిక్షను సమర్ధిస్తే జైలు జీవితం కూడా గడపక తప్పదు.