కోయంబత్తూరు డీఐజీ విజయ్ కుమార్ (45) నేటి తెల్లవారుజామున క్యాంపు కార్యాలయంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన గన్‌మెన్‌కు చెందిన పిస్తోల్‌తో అతను పేల్చుకున్నాడు. కోయంబత్తూరులోని క్యాంపు ఆఫీసులో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం విజయ్‌కుమార్ జాగింగ్‌కు వెళ్లాడు.
రేస్ కోర్సులో ఉన్న క్యాంపు ఆఫీసుకు వచ్చిన తర్వాత ఉదయం 6.50 నిమిషాలకు అతను తనను తానే కాల్చుకున్నాడు. అయితే ఎందు వల్ల అతను ఆ అఘాయిత్యానికి పాల్పడ్డాడో ఇంకా తెలియలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. కోయంబత్తూరు రేంజ్ డీఐజీ ఆఫీసర్‌గా జనవరి 6వ తేదీన విజయ్‌కుమార్ బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఆయన అన్నానగర్ డీసీపీగా పనిచేశారు.
తమిళనాడులోని తేని జిల్లాకు చెందిన విజయకుమార్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఆ తర్వాత గ్రూప్ వన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి డీఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. మొదటగా నెల్లై జిల్లా వల్లియూర్‌లో ఏఎస్పీగా కెరీర్ ప్రారంభించారు. దీని తర్వాత కాంచీపురం, కడలూరు, నాగపట్నం, తిరువారూరు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు.
సీబీసీఐడీలో ఎస్పీగా కూడా పనిచేసిన విజయకుమార్ సాతంకుళం జంట హత్య కేసును తొలిసారిగా దర్యాప్తు చేశారు. కోయంబత్తూరు, తిరుపూర్, ఈరోడ్, నీలగిరి నాలుగు జిల్లాల పర్యవేక్షణ అధికారిగా పని చేశారు. గత జనవరిలో విజయకుమార్ కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు. గత రెండు రోజులుగా విజయకుమార్ కుటుంబ కారణాలవలన మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఆయన కొంత కాలంగా నిద్ర సరిగా ఉండటం లేదని తోటి అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. మొత్తానికి డిప్రెషన్‌తోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తోంది. నిన్న రాత్రి కోయంబత్తూరు డిప్యూటీ కమిషనర్ కుమారుడి పుట్టినరోజు వేడుకలకు సైతం హాజరైన విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది.
కాగా.. విజయకుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పాంథియా రోడ్డు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలపై కూడా విచారణ జరుపుతామని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తెలిపారు. విజయ్ కుమార్ మృతి విషయం తెలుసుకుని దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా విజయ్ కుమార్ కుటుంబ సభ్యులకు స్టాలిన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

More Stories
`నేను నా కూతురిని కోల్పోయాను, మమతా పదవి కోల్పోయింది’
నీట్ యూజీ రీ-టెస్ట్‌ను సజావుగా జరిపేందుకు సహకరించండి
యూపీ అసెంబ్లీ, సెక్రటేరియట్ పై ఉగ్ర దాడికి భారీ కుట్ర