ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం

ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటలు.. నాలుగు బోగీలు దగ్ధం
బాలాసోర్ ఘటనను మరువక ముందే హౌరా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఫలక్‌నుమా రైలు (రైలు నం – 12703)లో పెను ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా రైలులో మంటలు అలముకున్నాయి. ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.  పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
అధికారులు అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి.  మంటల్లో నాలుగు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి. సమాచారం అందుకున్న రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌ హుటాహుటిన సంఘటన స్థలికి బయల్దేరారు.
మొత్తం ఆరు బోగీలకు మంటలు వ్యాపించినట్లు తెలుస్తోంది. ఇందులో 4 దగ్ధం కాగా… ఆరో బోగీ వద్ద ఉన్న జాయింట్ ను తొలగించారు. మంటలు చేలరేగిన స్థలం నుంచి రైలను ముందుకు నడిపారు.  ఈ ఘటనలో ఎస్ 3, ఎస్ 4, ఎస్ 5, ఎస్ 6 భోగీలు పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
ఫలక్ నుమా రైలు పశ్చిమ బెంగాల్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్తుండగా పగిడిపల్లి సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మంటలకు బోగీలు కాలిపోవడంతో దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. లోకో పైలట్ గమనించి ట్రైన్‌ను నిలిపివేశాడు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

 
ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాలిపోయిన బోగీలలో ఎక్కువమంది శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ వాసులు ఉన్నారని, మంటలు రాగానే చైన్ లాగి ట్రైన్‌ను నిలిపివేసినట్లు తెలిపారు. ట్రైన్ లాగేయకుండా ఉంటే భారీ ప్రమాదం జరిదేని చెప్పారు. పట్ట పగలు కావడంతో మంటలను గమనించడంతో ప్రమాదం తప్పిందని ప్రయాణికులు చెబుతున్నారు.