ఏఐఏడీఎంకే ఎంపీ ఎన్నిక చెల్లదు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వమ్ కుమారుడు, ఎఐఎడిఎంకె ఎంపి ఓపి రవీంద్రనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో తేని నుంచి తెలుపొందిన రవీంద్రనాథ్ ఎన్నిక చెల్లదని మద్రాసు హైకోర్టు గురువారం ప్రకటించింది. ఆ పార్లమెంటరీ స్థానం వెంటనే ఖాళీ అయినట్టు ప్రకటించింది.

తన గెలుపుకోసం రవీంద్రనాథ్ అక్రమ చర్యలకు పాల్పడ్డారని,  తన కుటుంబ సభ్యుల స్థిర, చరాస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొనకుండా దాచి పెట్టారని ఆరోపిస్తూ తేనికి చెందిన పీ మలనీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేసిన ధర్మాసనం..ఆస్తుల వివరాలు దాచిపెట్టారన్న విషయం నిరూపితమైందని.. ఈ నేపథ్యంలో రవీంద్రనాథ్‌ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది.

 అయితే తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు అవకాశమిస్తూ రవీంద్రనాథ్‌కు జస్టిస్ ఎస్‌ఎస్ సుందర్ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ నెలరోజుల వ్యవధి ఇచ్చింది.  2019 లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడులోని 39 స్థానాలలో 38 స్థానాలను డిఎంకె-కాంగ్రెస్ కూటమి గెలుచుకోగా అన్నా డిఎంకె నుంచి రవీంద్రనాథ్ ఒక్కరే గెలుపొందారు. 

పన్నీర్‌సెల్వం పెద్దకుమారుడైన రవీంద్రనాథ్‌కు ఈ ఎన్నికల్లో 76,672 ఓట్ల ఆధిక్యత లభించింది. కాంగ్రెస్ అభ్యర్థి ఇవికెఎస్ ఇళంగోవన్‌పై ఆయన గెలుపొందారు. లోక్‌సభలో అన్నాడిఎంకె తరఫున ఏకైక ఎంపి అయినప్పటికీ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని ఎడప్పాడి కె పళనిస్వామి చేజిక్కించుకోవడంతో తన తండ్రి పన్నీర్‌సెల్వమ్ తిరుగుబాటు చేసిన కారణంగా 2022లో పార్టీ ఆయనను బహిష్కరించింది.