ఆర్టికల్ 370 రద్దుపై పిటీషన్లు 11న `సుప్రీం’లో విచారణ

జమ్మూ కాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడం, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారించడానికి దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చింది. ఈ నెల 11వ తేదీన లిస్టింగ్ చేసింది.
అత్యంత సున్నితమైన, సమస్యాత్మక అంశం కావడం వల్ల వీటిపై విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు- ప్రత్యేకంగా రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది. అయిదు మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్లను విచారిస్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ సారథ్యాన్ని వహించే ఈ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు.
 
ఈ నెల 11వ తేదీన ఆయా పిటీషన్లన్నింటినీ విచారిస్తామని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ఆర్టికల్ 370ని రద్దు చేయడం, జమ్మూ కాశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ 2020లో పలు పిటీషన్లు దాఖలైన విషయం తెలిసిందే. 2020 నుంచి ఇప్పటివరకు కూడా సుమారు 23 పిటీషన్లు లిస్టింగ్‌ కాలేదు.
 
2020 మార్చిలో చివరిసారిగా ఈ పిటీషన్లు లిస్ట్ అయ్యాయి గానీ బెంచ్ మీదికి విచారణకు రాలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు వాటిని విచారణకు స్వీకరించింది. ఈ నెల 11వ తేదీన లిస్టింగ్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. ఆర్టికల్ 370 రద్దయిన ఇన్ని సంవత్సరాల తరువాత సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలను జారీ చేస్తుంది?, పిటీషన్లపై విచారణ సందర్భంగా ఎలాంటి వాదనలు వెలువడతాయనేది ఆసక్తి రేపుతోంది.