ముందుకు సాగని కృష్ణా నదిపై రెండు మినీ బ్యారేజీల నిర్మాణం

ప్రకాశం బ్యారేజ్‌కు దిగువన రెండు మినీ బ్యారేజీ నిర్మాణానికి రూ. 2,862 కోట్లతో మూడేళ్ల ఏళ్ల క్రితం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం లభించినా ఆ పనులు ముందుకు సాగడం లేదు. సంవత్సరంకు పైగా ఆర్ధిక శాఖ అనుమతులకు ఎదురు చూస్తున్నట్లు తెలుస్తున్నది. కృష్ణానదికి వరదలొస్తే వందలాది టీ-ఎంసీల నీరు సముద్రం పాలవుతోంది.
మరోవైపు సముద్రానికి పోటు వచ్చిన ప్రతిసారీ సముద్రపు నీరు ముందుకు వస్తోంది. ఫలితంగా కృష్ణా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూములు చౌడుబారిపోతున్నాయి. భూగర్భ జలాలు ఉప్పుమయం అవుతున్నాయి.  ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని వరద నీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా తీర్చిదిద్దడంతో పాటు  భూగర్భ జలాలు ఉప్పునీటి కయ్యలు కాకుండా నివారించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురంల మధ్య కృష్ణా నదిపై 3 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యంతో రూ.1512 కోట్ల కోట్ల వ్యయంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని తీర్మానించింది.  అలాగే రెండవది మోపిదేవి మండలం బండికోళ్లలంక – బాపట్ల జిల్లా రేపల్లె మండలం తూర్పుపాలెం నడుమ కృష్ణానదిపై రూ. 1350 కోట్ల ఖర్చుతో 3 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణం చేయాలని నిర్ణయించింది.
కృష్ణా నదిపై నిర్మించబోయే కొత్త బ్యారేజీలకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను ఇప్పటికే సిద్ధం చేశారు.  ఈ రెండింటిలో ఒక దానికే ప్రస్తుతం పరిపాలన ఆమోదం ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. నదికి శివారున నిర్మించే రెండో బ్యారేజీకి ఆమోదం తెలిపిన తర్వాత మిగిలిన బ్యారేజీ గురించి ఆలోచించాలని సర్కారు భావిస్తున్నట్టు- సమాచారం. ఈ డీపీఆర్‌కు ప్రభుత్వం రూ.2.5 కోట్లను కేటాయించింది.
 
ప్రకాశం బ్యారేజీకి దిగువన 12 కిలోమీటర్ల దూరంలో పెనమలూరు మండలం చోడవరం వద్ద ఒక బ్యారేజీనీ, దీనికి దిగువన 60 కిలోమీటర్ల దూరంలో మోపిదేవి వద్ద మరో బ్యారేజీనీ నిర్మించడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ బ్యారేజీల డిజైన్లకు జలవనరుల శాఖ ఆమోదించింది.
 
చోడవరం, మోపిదేవి వద్ద బ్యారేజీల్లో ఒక్కో దాంట్లో 4.5 టీఎంసీ నీరు నిల్వ ఉండేలా నిర్మించాలని నిర్ణయించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన నదీ పరీవాహక ప్రాంతంలో చుక్క నీరు ఉండట్లేదు. వరదలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం నిండుకుండలా కనిపిస్తుంది. చోడవరం, శ్రీకాకుళం వద్ద నిర్మిస్తే మూడు బ్యారేజీలు అవుతాయి. కొత్తగా మినీ బ్యారేజీలు అందుబాటులోకి వస్తే మొత్తం 11.17 టీఎంసీల నీరు నిల్వ ఉంటుంది.