మణిపూర్‌పై సమగ్ర స్థాయీ నివేదిక కోరిన సుప్రీంకోర్టు

మణిపూర్‌లో తాజా పరిస్థితిపై సమగ్రంగా స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో హింసాకాండను అదుపు చేయడానికి తీసుకున్న చర్యలు, బాధిత ప్రజల పునరావాసానికి తీసుకున్న చర్యలు, నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు, భద్రతా దళాల మోహరింపు, మణిపూర్‌లో తాజా పరిస్థితిని సమగ్రంగా వివరిస్తూ ఒక స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా, మణిపూర్ ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్థాయీ నివేదికను సమర్పించడానికి కొంత సమయం కావాలని చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 10వ తేదీతో ధర్మాసనం వాయిదా వేసింది.

మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గన్సాల్వేజ్ వాదిస్తూ మణిపూర్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని, హింసాకాండలో మరణించిన కుకీ తెగల సంఖ్య 120కి చేరుకుందని తెలిపారు. రాష్ట్రంలో కుకీ కమ్యూనిటీని రూపుమాపుతామని కొంతమంది బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సాయుధ దుండగులను అడ్డుకోకుంటే హింస తీవ్రమౌతుందని, గత రాత్రి ముగ్గురు గిరిజనులను హత్య చేశారని, వారిలో ఒకరి తల నరికివేసి క్రూరంగా హత్య చేశారని తెలిపారు.

అయితే ఈ వ్యాఖ్యలను సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ఖండించారు. రాష్ట్రంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయని, కర్ఫ్యూను కూడా ఐదుగంటలకు తగ్గించామని అన్నారు. దానిలో భాగంగా పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌, 114 కంపెనీల సిఎపిఎఫ్‌, 114 కాలమ్స్‌ ఆర్మీని మోహరించామని కోర్టుకు వివరించారు.