పక్షం రోజుల్లో అదుపులోకి టమాటో ధరలు

దేశంలో టామాటల ధరలు వచ్చే 15 రోజులలో అదుపులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. నెల రోజుల్లో సాధారణ పరిస్థితి ఏర్పడుతుందని వెల్లడించింది. సామాన్యుడి నిత్యావసర కూర అయిన టమాటల ధరలు పలు ప్రాంతాలలో కిలో వంద దాటుతున్న సందర్భంలో వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ స్పందించారు.

వర్షాలతో ఈ పంట దెబ్బతింది. రాబోయే కొద్ది రోజులలో ఉత్పత్తి కేంద్రాల నుంచి సరుకులు చేరుకుంటాయి. మార్కెట్లలో కటకట తగ్గుతుంది. దీనితో ధరలు తగ్గుతాయని వివరించారు. వర్షాకాలం ఆరంభంలో టమాట ధరల పెరుగుదల పరిణామం సాధారణం అన్నారు. సరఫరాల లోటు ఈ పరిస్థితికి దారితీసిందని తెలిపారు. టమాట చాలా నాజూకైన సరుకు, ఎటువంటి ప్రతికూలతలను తట్టుకోలేదు.

దూర ప్రాంతాల నుంచి దీనిని రవాణా చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, వాతావరణ మార్పులతో ఈసారి కూడా ఈ సరుకుపై ప్రభావం పడిందని తెలిపారు. టమాటలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడం కుదరదని, ఎక్కడికక్కడ సమీప ప్రాంతాల నుంచి మార్కెట్లకు తరలించడమే మార్గం అని పేర్కొంటూ త్వరలోనే పరిస్థితిలో మార్పు వస్తుందని తెలిపారు.

సాధారణంగా జూన్ నుంచి ఆగస్టు, అక్టోబర్ నుంచి నవంబర్ టమాట దిగుబడి తగ్గే కాలం కావడంతో ఈ దశలో ధరలు పెరుగుతాయని వివరించారు. దేశవ్యాప్తంగా సీజన్‌లకు అతీతంగా టమాట సర్వసాధారణ సరుకు కావడంతో ఏడాదంతా ఇది సముచిత ధరలకు అందుబాటులో ఉంచేందుకు అవసరం అయిన పద్ధతుల గురించి ఆలోచిస్తున్నట్లు తెలిపారు. సరఫరాల క్రమబద్ధీకరణ జరుగుతుందని పేర్కొన్నారు.