తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం చెల్లింపు

జులై 1 నుండి రైల్వే సేవలలో పలు మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. తత్కాల్ టిక్కెట్ల రద్దుపై 50 శాతం మొత్తం తిరిగి ఇస్తారు. జూలై 1 నుండి తత్కాల్ టిక్కెట్ల నిబంధనలలో జరిగే మార్పుల ప్రకారం ఏసీ కోచ్‌కి ఉదయం 10 నుంచి 11 గంటల వరకు టికెట్ బుకింగ్, స్లీపర్ కోచ్‌లు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బుక్ చేస్తారు.
 
సువిధ రైళ్లలో టిక్కెట్ల వాపసుపై 50% ఛార్జీ వాపసు చేస్తారు. ఇది కాకుండా, ఏసీ-2పై రూ.100/-, ఏసీ-3పై రూ.90/-, స్లీపర్‌పై ఒక్కో ప్రయాణికుడికి రూ.60/- తగ్గిస్తారు. రైల్వేలు నడుపుతున్న సువిధ రైళ్లలో ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్  అవాంతరం తొలగించి కన్ఫర్మ్ టిక్కెట్ల సౌకర్యం కల్పిస్తారు. రాజధాని, శతాబ్ది రైళ్లలో జూలై 1 నుంచి పేపర్‌లెస్ టిక్కెట్ సదుపాయం ప్రారంభిస్తున్నారు.
ఈ సదుపాయం తర్వాత, శతాబ్ది , రాజధాని రైళ్లలో పేపర్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు, బదులుగా టికెట్ ను ప్రయాణికుల మొబైల్‌కు పంపుతారు. త్వరలో వివిధ భాషల్లో రైల్వే టికెటింగ్ సౌకర్యం ప్రారంభం కానుంది. ఇప్పటి వరకు, రైల్వేలో టిక్కెట్లు హిందీ, ఇంగ్లీషులో అందుబాటులో ఉన్నాయి. అయితే కొత్త వెబ్‌సైట్ తర్వాత, ఇప్పుడు టిక్కెట్లను వివిధ భాషలలో బుక్ చేసుకోవచ్చు.

రైల్వేలో టిక్కెట్ల కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో జూలై 1 నుంచి శతాబ్ది, రాజధాని రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచనున్నారు. రద్దీ సమయాల్లో మెరుగైన రైలు సౌకర్యాన్ని అందించడానికి ప్రత్యామ్నాయ రైలు సర్దుబాటు వ్యవస్థ, సువిధ రైలు, ముఖ్యమైన రైళ్ల డూప్లికేట్ రైలు రన్నింగ్ ప్రణాళిక చేశారు.

రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1 నుండి రాజధాని, శతాబ్ది, దురంతో, మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో సువిధ రైళ్లను నడపనుంది. జూలై 1 నుంచి ప్రీమియం రైళ్లను రైల్వే పూర్తిగా ఆపబోతోంది. కాగా, రైలులో ప్రయాణించే ప్రయాణికుల కోసం రాత్రి వేళల్లో గమ్యస్థానం స్టేషన్‌కు చేరుకునేలోపు రైల్వే వేక్అప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని ప్రారంభించింది. 139కి కాల్ చేయడం ద్వారా పిఎన్ఆర్ లో వేకప్ కాల్-డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని యాక్టివేట్ చేయాలి.