కేజ్రీవాల్ బంగ్లా ఆధునికరణపై కాగ్ ఆడిట్

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్  అధికారిక బంగ్లా ఆధునీకరణ, పునర్నిర్మాణ కార్యకలాపాల్లో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోరింది. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు మేరకు కేంద్రం ఈ చర్యలు చేపట్టింది.

లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారులు మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణంలో ఆర్థికపరమైన అక్రమాలు జరిగినట్లు స్థూలంగా, ప్రాథమికంగా వెల్లడైనట్లు లెఫ్టినెంట్ గవర్నర్ సచివాలయం గుర్తించింది. అనంతరం మే 24న కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ సమాచారాన్ని తెలియజేసింది.

మార్పులు, చేర్పులు పేరుతో ఈ పునర్నిర్మాణం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండానే పూర్తి స్థాయిలో ఓ కొత్త భవనాన్ని ప్రజా పనుల శాఖనిర్మించింది. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమర్పించిన నివేదిక ప్రకారం, కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణం కోసం రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు ఖర్చవుతుందని మొదట్లో అంచనా వేశారు.

కానీ దీనిని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ పోతూ, రూ.53 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఈ నిర్మాణం కోసం పర్యావరణ చట్టాలతోపాటు వివిధ నిబంధనలను ఉల్లంఘించారు. కేజ్రీవాల్ అధికారిక బంగళా పునర్నిర్మాణంపై కాగ్ చేత ప్రత్యేక ఆడిట్ జరిపించాలని కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఆమ్ ఆద్మీ పార్టీ స్పందిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవడం రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.