మణిపూర్ పరిస్థితులపై కేంద్ర మంత్రులతో ప్రధాని భేటీ!

అమెరికా, ఈజిప్ట్ దేశాలలో ఆరు రోజుల పర్యటన అనంతరం భారత్ కు తిరిగివచ్చిన  ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం కేబినెట్‌ మంత్రులతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.  కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌, హర్దీప్‌ సింగ్‌ పూరిలతోపాటు పలువురు సీనియర్‌ అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో మణిపూర్‌ అల్లర్లపై చర్చించనున్నట్లు సమాచారం.
 
దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. గత వారం రోజులుగా అక్కడ పరిస్థితులు మెరుగవుతున్నాయని, సత్వరమే సాధారణ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
ప్రధానమంత్రి భారత్ కు తిరిగి రాగానే విమానాశ్రయంలోనే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే జరుగుతుందా? అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు.
కాగా, మణిపూర్‌లో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై శనివారం అమిత్‌షా అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్‌ కే సంగ్మా, సిపిఎం ఎంపి జాన్‌ బ్రిట్టాస్‌ తదితర నేతలు హాజరయ్యారు.
 
ఈ సమావేశం అనంతరం ఆదివారం మణిపూర్‌ హింసపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌, హోంమంత్రి అమిత్‌షాకు వివరించారు. ఈ సందర్భంగా అల్లర్లను చాలావరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయగలిగాయని బీరెన్‌ సింగ్‌ షాకు తెలిపారు. మణిపూర్‌లో యథాపూర్వ పరిస్థితి నెలకొనేందుకు కేంద్రం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందని హోం మంత్రి భరోసా ఇచ్చినట్టు చెప్పారు.
 
జూన్ 13 తర్వాత హింసాయుత సంఘటనల కారణంగా ఎవ్వరూ చనిపోలేదని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా చెప్పారు. అఖిలపక్ష సమావేశం, బీరెన్‌సింగ్‌ వివరించిన పరిస్థితుల మేరకు.. తాజాగా సోమవారం మణిపూర్‌ అల్లర్లపై ప్రధాని కీలక సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.