రష్యా ఆర్మీ హెలికాప్టర్ల దాడి.. వాగ్నర్‌ గ్రూప్‌ వెనుకడుగు 

యెవ్‌జనీ ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ ఆర్మీ తిరుగుబాటును  అణిచివేసేందుకు రష్యా ఆర్మీ రంగంలోకి దిగింది. వోరోనెజ్ హైవే పై ఉన్న వాగ్నర్ గ్రూపు సైనిక వాహన శ్రేణిపై ఆర్మీ హెలికాప్టర్లు దాడులు చేశాయి. బాంబులు వేయడంతో కొన్ని సైనిక వాహనాలు ధ్వంసమయ్యాయి. అలాగే వోరోనెజ్‌లోని ఆయిల్‌ డిపోపై కూడా ఆర్మీ హెలికాప్టర్‌ బాంబు దాడి చేసింది.
 
దీంతో భారీగా మంటలు వ్యాపించగా పొగలు దట్టంగా అలముకున్నాయి. సుమారు వందకు పైగా ఫైర్‌ ఇంజిన్లతో ఆ మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వోరోనెజ్ ప్రాంత గవర్నర్‌ తెలిపారు. మరోవంక, ప్రైవేట్‌ ఆర్మీ వాగ్నర్‌ గ్రూప్‌ ఆధీనంలో ఉన్న రోస్టోవ్‌లో కూడా పేలుళ్లు జరిగాయి. దీంతో అక్కడి జనం భయంతో రోడ్లపై పరుగులు తీశారు.  మరోవైపు రష్యా సైన్యాన్ని అడ్డుకునేందుకు వాగ్నర్‌ గ్రూప్‌ ఆ నగరం అంతటా యాంటీ ట్యాంక్‌ మైన్లను ఏర్పాటు చేస్తున్నది. అయితే స్థానిక ప్రజలు కొందరు వాగ్నర్‌ గ్రూప్‌ సైన్యానికి ఆహారం, తాగునీరు ఇచ్చారు. ఈ వీడియో క్లిప్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.
అయితే అనూహ్యంగా తమ రష్యా ప్రజల రక్తం చిందించకుండా నివారించేందుకు తమ దళాలు వెనుకడుగు వేయనున్నట్టువాగ్నర్ గ్రూపు అధిపతి ప్రిగోజిన్ప్ ప్రకటించారు. తమ డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ మాస్కో కు 200 కిమీ దూరంలో ఉన్న తమ దళాలు ముందుకు వెళ్లవని చెప్పారు. ఈ ప్రకటనతో సుమారు రెండు దశాబ్దాల పుతిన్ అధికారానికి ఎదురైనా అతిపెద్ద సవాల్ నుండి ఆయన బయటపడినట్లు స్పష్టమవుతుంది.
 
ర‌ష్యా సైన్యాధికారుల‌పై వాగ్న‌ర్ ద‌ళం తిరుగుబాటు ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో అంత‌ర్గత దేశ ద్రోహుల నుంచి దేశాన్ని ర‌క్షించుకుంటామ‌ని ఆ దేశ అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్  స్పష్టం చేశారు.  సోద‌రుడే సోద‌రున్ని మోసం చేస్తున్న‌ట్లు ఆయ‌న ఆరోపించారు. దేశ ద్రోహానికి పాల్ప‌డుతూ సైనిక చ‌ర్య‌కు దిగుతున్న వ్య‌క్తుల్ని శిక్షిస్తామ‌ని  పుతిన్ హెచ్చరించారు.
 
ఉక్రెయిన్‌తో యుద్ధం సాగుతున్న ద‌శ‌లో వాగ్న‌ర్ తిరుగుబాటు వెన్నుపోటే అవుతుంద‌ని పుతిన్ స్పష్టం చేశారు. శ‌నివారం జాతిని ఉద్దేశించి పుతిన్ ప్రసంగిస్తూ దేశ ద్రోహుల నుంచి రష్యాను రక్షించుకుంటామని, సైనిక కుట్రకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సైనిక తిరుగుబాటుకు ఉసిగొల్పిన వారిని అడ్డుకుంటామ‌ని చెబుతూ ఇలాంటి స‌మ‌యంలో ఐక్య‌త కావాల‌ని, బాధ్య‌త అవ‌స‌ర‌మ‌ని పేర్కొన్నారు.
 
అంత‌ర్గ‌త కుమ్ములాట చాలా ప్ర‌మాద‌క‌ర‌మైంద‌ని, దేశానికి స‌మ‌స్య‌గా మారుతుంద‌ని, ర‌ష్యా ప్ర‌జ‌ల‌కు ఇది ఎదురుదెబ్బ అవుతుంద‌ని, స్వ‌దేశాన్ని కాపాడేందుకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని, అటువంటి దేశ‌ద్రోహాల‌ను క‌ఠినంగా శిక్షిస్తామ‌ని పుతిన్ హెచ్చ‌రిక చేశారు.కాగా, వాగ్నర్‌ గ్రూప్‌పై తమ సైన్యం పోరాడుతుందని చెచెన్యా అధినేత రంజాన్ కదిరోవ్‌ తెలిపారు. యెవ్‌జనీ ప్రిగోజిన్‌ నేతృత్వంలోని వాగ్నర్‌ ఆర్మీ తిరుగుబాటును అణిచివేస్తామని చెప్పారు. అవరసమైతే కఠిన పద్ధతులను ఉపయోగిస్తామని హెచ్చరించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు సహకరించేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉందని తెలిపారు.

కాగా మాస్కోకు దాదాపు 660 మైళ్ల దూరంలో ఉన్న రొస్తోవ్ ఆన్ డాన్‌లోని మిలిటరీ ప్రధాన స్థావరంపై వాగ్నర్ గ్రూపు పూర్తి కంట్రోల్ సాధించినట్లు కనిపిస్తోందని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇంటెలిజన్స్ బ్రీఫింగ్‌లో పేర్కొంది. ఉక్రెయిన్‌లో తన దాడుల ఆపరేషన్ కార్యకలాపాలను రష్యా ప్రభుత్వం ఇక్కడినుంచే కొనసాగిస్తోంది.

మరోవైపు, రష్యన్లను ఉద్దేశించి పుతిన్ ప్రసంగించడానికి ముందు రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగు వాగ్నర్ గ్రూప్‌లో ఉన్న సైనికులతో మాట్లాడారు. మీరంతా మెసానికి గురయ్యారని, మిమ్మల్ని యెవ్జెనీ ప్రిగోజిన్ ఒక నేరంలోకి నెట్టేశారని వారికి తెలిపారు. వాగ్నర్ గ్రూప్‌లో ఉన్న సైన్యం అంతా స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించారు. అలా చేస్తే వారి భద్రతకు ఎలాంటి ప్రమాదం ఉండదని హితవు పలికారు.